Muncipal Workers Strike : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Ap Government) మున్సిపల్  కార్మికుల(Muncipal Workers)ను మరోసారి చర్చలకు ఆహ్వానించింది. రేపు సాయంత్రం 3గంటలకు సచివాలయం (Secratarieat) లోని మున్సిపల్ కార్మిక సంఘాలతో సమావేశం కానుంది. సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాల మధ్య చర్చలు జరగనున్నాయి. రెండు వారాలుగా సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ప్రభుత్వం మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలను చర్చలకు పిలిచింది. 


6వేలు వేతనంలో కలిపి ఇస్తామన్న ప్రభుత్వం


మూడు రోజుల క్రితం మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. సచివాలయంలో కార్మిక సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లపై మూడు గంటలకుపైగా...కార్మిక సంఘాలతో చర్చించారు. మున్సిపల్ కార్మిక సంఘాల డిమాండ్లన్నీ అంగీకరించామన్నారు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. హెల్త్ అలవెన్స్ రూ.6వేలు వేతనంలో కలిపి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. హెల్త్ అలవెన్స్ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని ప్రతిపాదన చేశారు. కార్మికులకు పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తామని వెల్లడించారు. విధుల్లో మరణించిన వారికి రూ.5లక్షల నుంచి రూ.7లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని బొత్స సత్యనారాయణ కోరారు. మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీతంలోనే హెల్త్‌ అలవెన్స్ కలిపి రూ. 21 వేలు ఇస్తామని ఏపీ సర్కార్ హామీ ఇచ్చింది. 


24 వేలు ఇవ్వాల్సిందేనంటున్న కార్మిక సంఘాలు


ప్రధాన అంశాలపై ప్రభుత్వం ఎటూ తేల్చలేదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. హెల్త్ అలవెన్స్ జీతంతో కలిపడం కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్మినెంట్, కాంట్రాక్ట్ వర్కర్ల క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై మండిపడుతున్నారు.  అందుకే, సమ్మెను కొనసాగిస్తామన్నారు కార్మిక సంఘాల నాయకులు. ప్రభుత్వ ప్రతిపాదనను మున్సిపల్ కార్మిక సంఘాలు తిరస్కరించాయి. నెలకు రూ.24 వేలు ఇవ్వాలని...రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగిస్తున్నారు.