Chandra Babu: ఏపీలో ఎన్నికల హామీలు ఒక్కొక్కటీ నెరవేర్చుకుంటూ వస్తున్న ప్రభుత్వం...మరో కీలక పథకం అమలకు సిద్ధమైంది. ఏడాదికి మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టింది.


త్వరలోనే ఉచిత గ్యాస్
ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనికి అవసరమైన నిధులు సేకరణపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ దృష్టిసారించింది.  రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం తెల్లరేషన్‌కార్డులకు కోటీ 55 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్‌ ధరల ప్రకారం చూస్తే ఒక్కో సిలిండర్‌కు మొత్తం. రూ.1365 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రకారంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలంటే రాష్ట్ర ఖజనాపై రూ.4095 కోట్లు ఖర్చు భారం పడనుంది. అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్యాస్ సిలిండర్‌కు రూ.200 సబ్సిడీ ఇస్తోంది. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 59 లక్షల కుటుంబాలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. ఇవన్నీ దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలే. ఈ కనెక్షన్లు పొందిన వారంతా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకానికి అర్హులే. కాబట్టి వీరందరికీ ఆ  ప్రయోజనం అందిస్తే....రాష్ట్రంపై కొంత భారం తగ్గే అవకాశం ఉంది. 


ఢిల్లీలో నాదెండ్ల చర్చలు
ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ కేంద్రమంత్రులను కలిసి ఈ విషయంపై చర్చించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి దీపం కనెక్షన్లు ఉన్న వారందరికీ సబ్సిడీ వర్తింపజేయాలన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుందని విజ్ఞప్తి చేశారు. కేంద్రం అంగీకరిస్తే ఏడాదికి దాదాపు రూ.1535 కోట్ల భారం తగ్గుతుంది. లేదంటే మొత్తం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వమే గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించాల్సి ఉంటుంది. 


నాడు దీపం -నేడు ఉచిత గ్యాస్
పేదరికం నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ గ్యాస్ కనెక్షన్ ఉండాలని చంద్రబాబు దీపం పథకాన్ని అమలు చేశారు. తెల్లరేషన్ కార్డులు ఉన్నవారికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చారు. ఇప్పుడు పేదలందరికీ ఉచితంగా  ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.


నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ చేయడమా...లేక గ్యాస్‌ సంస్థలకు ఇవ్వడమా అన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా  చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల హామీలు ఒక్కొక్కటీ అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ  పెంచిన పింఛన్లు అందిస్తోంది. అలాగే త్వరలోనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణసౌకర్యం తీసుకురానుంది. ఇప్పుడు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వడం ద్వారా మహిళలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఎన్నికల్లో మహిళలు మొత్తం కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం వల్లే అంత మెజార్టీ సీట్లు సాధించామని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు.