Biggest Ambedkar Statue In Vijayawada: బెజవాడ(Bezawada) స్వరాజ్ మైదానం(Swaraj Maidanam)లో నిర్మిస్తున్న భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ విగ్రహం దేశంలోనే అతి పెద్ద విగ్రహంగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ విగ్రహం 206 అడుగుల ఉందని ఇందులో 81 అడుగులు బేస్‌ ఉంటే, 125 అడుగులు విగ్రహం ఉందని తెలిపింది. 


రాత్రి వేళలో ఈ విగ్రహం కనిపించేలా ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. దీనికి స్టాట్యూ ఆఫ్‌ సోషల్ జస్టిస్‌ పేరుతో దీన్ని ఆవిష్కరించనున్నారు. ఇవాళ సీఎం చేతుల ఆవిష్కరించే విగ్రహాన్ని చూసేందుకు రేపటి(జనవరి 20) నుంచి సామాన్య పర్యాటకులకు అవకాశం కల్పిస్తారు. 


404 కోట్లతో ప్రాజెక్టు


ఈ ప్రాజెక్టు 18.18 ఎకరాల్లో నిర్మించారు. దీని కోసం 404.35 కోట్లు ఖర్చు పెట్టారు. నిలువెత్తు అంబేద్కర్ విగ్రహంతోపాటు అందమైన గార్డెన్‌ కూడా రూపుదిద్దారు. దీన్ని ఎంస్‌ అసోసియేట్‌ సంస్థ దీన్ని డిజైన్ చేసింది. ఇక్కడ విగ్రహంతోపాటు వాటర్ బాడీస్, మ్యూజికల్‌ ఫౌంటేన్లు, చిన్నారులు ఆడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన పార్క్, వాకింగ్ కోసం ట్రాక్ ప్రత్యేక ఆకర్షణలుగా చెప్పవచ్చు.




ఈ స్మృతి వనంలో అంబేద్కర్ జీవిత విశేషాలు చెప్పే ఆర్ట్‌ వర్క్‌ను ఏర్పాటు చేశారు. మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షిస్తూ ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చేశారు. ఈ విగ్రహాన్ని సాయంత్రం నాలుగున్నరకు సీఎం ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. 




విగ్రహం ప్రత్యేకతలు ఇవే 



  • అంబేద్కర్ విగ్రహం ఎత్తు- 125 అడుగులు

  • పెడస్టల్(బేస్‌) ఎత్తు- 81 అడుగులు 

  • పెడస్టల్ సైజు - 3,481 చదరపు అడుగులు

  • పెడస్టల్‌తో కలిసి విగ్రహం మొత్తం ఎత్తు- 206 అడుగులు 

  • నిర్మించే అంతస్తులు-  జీ ప్లస్‌టు

  • విగ్రహానికి వాడిని కాంస్యం- 120 మెట్రిక్ టన్నులు 

  • విగ్రహం నిర్మాణం లోపలకు వాడిన స్టీల్- 400 మెట్రిక్ టన్నులు 

  • అంబేద్కర్‌ స్మృతివనానికి ఖర్చు చేసిన మొత్తం- 404.35 కోట్లు 

  • శాండ్‌ స్టోన్‌ 2,200 టన్నులు 

  • పనులు ప్రారంభ తేదీ- మార్చి 21, 2022

  • విగ్రహం ఆవిష్కరించే తేదీ-జనవరి 19, 2024




స్మృతి వనంలో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు రెండు అంతస్తులు ఉంటాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నాగులు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు ఉంటుంది. మిగిలిన మూడు హాళ్లు అంబేద్కర్ చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. ఇందులో 75 మంది కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


మొదటి అంతస్తులో 2250 చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లు ఉంటాయి. ఒక హాల్లో అంబేద్కర్‌కు దక్షిణ భారత దేశంతో ఉన్న అనుబంధాన్ని తెలిపే వివరాలు ఉంచారు. మిగతా హాళ్లలో లైబ్రరీ, మ్యూజియంలు ఉంటాయి. సెకండ్ ఫ్లోర్‌లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు ఉంటాయి. వీటిని దేనికి ఉపయోగించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీటితోపాటు ఇక్కడ మినీథియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్‌ ఉన్నాయి. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


ఈ భవనాలను ఐసోసెల్స్‌ ట్రెపీజయం ఆకారంలో నిర్మించారు. దీని కోసం రాజస్థాన్‌ నుంచి తెప్పించిన పింక్‌ రాక్‌ను ఉపయోగించారు. 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రజలకు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేలా వీడియో సిస్టం ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని మాత్రం విజయవాడకు చెందిన ప్రసాద్‌ ఆధ్వర్యంలో రూపుదిద్దారు.