రాష్ట్రంలో తాము నిర్మిస్తున్నవి ఇళ్లు కాదని.. కాలనీలని పునరుద్ఘాటించారు సీఎం జగన్. అధికారంలోకి వస్తే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని చెప్పిన మాటకు కట్టుబడి హామీని నెరవేర్చామన్నారు. జగనన్న కాలనీల్లో 16,240 కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయని వివరించారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలోనే 13,140 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు సీఎం జగన్. ఇప్పుడు వాటి రేటు 7 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇళ్లు కట్టడం పూర్తై ఆ రేటు 15 నుంచి 20 లక్షల రూపాయలు అవుతుందన్నారు. 


చంద్రబాబు చేసిందేంటి 
16,601 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి టిడ్కో ఇళ్లు ఇచ్చామన్నారు జగన్. టీడీపీ మాత్రం ఆ ఇళ్ల పేరుతో 3 లక్షల రూపాయలు ప్రజలపై భారం వేసిందని గుర్తు చేశారు. ఇది ఇరవై ఏళ్లు ఉండేలా చేసిందన్నారు.  ఇందులో చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నించారు. చంద్రబాబు గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదని ఎద్దేవా చేశారు. గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు కూడా ఇవ్వలేదన్న్నారు సీఎం జగన్. 8,659 ఇళ్లకు అదనంగా జూలై 7న మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో 30.68 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటి వెలువ రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. 


ప్రతి పేద కుటుంబం కూడా బాగుపడాలనే బాధ్యతతో అడుగులు వేస్తున్నామన్నారు సీఎం జగన్. గుడివాడకు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నారని విమర్శించారు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలిచ్చిన దాఖలాలు లేవన్నారు. ఒక్క పేదవాడికి కూడా ఒక సెంటు ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. 


బాబు పాలనకు భిన్నంగా పేదల ప్రభుత్వంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నామన్నారు సీఎం. అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని ప్రభుత్వం నిర్మిస్తున్న కాలనీలు 17,000గా చెప్పారు. 5,52,000 ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఒక్కో ఇంటిని 2.70 లక్షలతో కడుతున్నామని... డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌కు లక్ష ఖర్చు పెడుతున్నామన్నారు. స్థలం విలువ 6 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల దాకా కూడా పోతుందని చెప్పారు. 


నిరుపేదలకు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు 2వేలు అని అన్నారు. ఒక్కో ప్లాట్‌కు దాదాపు 5.75 లక్షలు కట్టడానికి, మౌలిక సదుపాయాలకు మరో లక్ష ఖర్చు అవుతుందన్నారు. 300 అడుగులు 6.75 లక్షలు ఖర్చయ్యే ప్లాట్ కు కేంద్రం 1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం 1.5 లక్ష ఇస్తోందని వివరించారు. మిగిలిన 3 లక్షల రూపాయలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారని ఆరోపించారు. ప్రతి నెలా 3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూ పోవాల్సి వచ్చేదన్నారు. పేదవాడు 300 అడుగుల ఇంటిని సొంతం చేసుకొనేందుకు 7.20 లక్షలు జేబు నుంచి కట్టాలన్నారు. 


నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదని చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేశారు జగన్. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చ.అ.లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 1,43,600 ఇళ్లు ఇచ్చామన్నారు. అన్ని హక్కులతో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. వీటి విలువ 6.75 లక్షలు ఉంటుందని తెలిపారు. వీటిని ఒక్క రూపాయికే ఇస్తున్నామన్నారు. 


365 చదరపు అడుగులకు సంబంధించి గతంలో ఇదే మాదిరిగా లెక్కలు కట్టారన్నారు. రాష్ట్రం, కేంద్రం ఇస్తున్న 3 లక్షల సబ్సిడీకి అదనంగా 365 చదరపు అడుగుల వాటికి 50 వేలు కట్టించుకున్నారన్నారు. మీ బిడ్డ వచ్చిన తర్వాత 3 లక్షలు ఇవ్వడమే కాకుండా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కోసం లక్ష, మరో 25 వేలు కలిపి ప్రతి పేద వాడికి 4.25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. 430 చదరపు అడుగులు తీసుకున్న ప్రతి పేద వాడికీ 3 లక్షలు కాకుండా, డిపాజిట్ లక్ష నుంచి 50 వేలకు తగ్గించామని పేర్కొన్నారు. 4.50 లక్షల సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. 


ఇంత మంచి చేస్తుంటే కొంత మందికి ఈర్ష్య ద్వేషం ఎక్కువయ్యాయన్ని విమర్శించారు జగన్. తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేమిటని ప్రశ్నించారు. నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగిందో ఆలోచన చేయాలన్నారు. ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే బాబు ఎందుకు చేయలేకపోయారని ఆలోచించాలన్నారు. బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదన్నారు. 


అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందని ఏకంగా కోర్టుల్లో వాదించారన్నారు. అదే అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. ఇదే పనిని ఈ బాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 4 సంవత్సరాల కాలంలో 2.16 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వెళ్తున్నాయన్నారు. 4 ఏళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ రూపంలో 72 వేల కోట్లు అవ్వాతాతలకు ఇవ్వగలిగామన్నారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఎలాగూ లేదని... ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి కుప్పంలో ఇళ్లు కట్టుకుంటానని పర్మిషన్ కోసం అడుగుతున్నారన్నారు కుప్పంలో మైకు పట్టుకొని ఇంకో చాన్స్ ఇవ్వండి చేసేస్తాం అంటాని ఎద్దేవా చేశారు. 


సీఎంగా ఉన్న ఆ రోజుల్లో మీ ప్రతి ఇంటికీ ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండని అడగలేడన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక ఖురాన్,భగవద్గీత, బైబిల్ గా భావిస్తాం.. ప్రతిసారీ చంద్రబాబు మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం చేశారన్నారు. రెండు పక్కలా రెండు పార్టీలు ఉంటే తప్ప నిలబడలేని బాబు మనకు ప్రత్యర్థి అట. 175 నియోజకవర్గాల్లో క్యాండేట్లను పెట్టలేని వ్యక్తి మనకు ప్రత్యర్థట. తాను ఎమ్మెల్యే అవుతానని, ఎవరు ఆపుతారో చూస్తానని అంటున్న దత్తపుత్రుడు మరో వంక అని విమర్శలు చేశారు. అధికారంతో రాస్ట్రాన్ని దోచుకున్న గజ దొంగల ముఠా తనకు అండగా లేకపోవచ్చన్నారు. అబద్దాలన్నీ నమ్మకండని ఇంట్లో మంచి జరిగిందా అనేది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. 


పూల వర్షం 
గుడివాడలో టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. టిడ్కో గృహ సముదాయంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.  మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌లోని టిడ్కో ఇళ్ల మధ్య నుంచి సీఎం రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడవునా ప్రజలు పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్‌, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని,  ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వల్లభనేని వంశీ పాల్గొన్నారు.