Navaratri 2025 in Kanakadurga Temple, Vijayawada | విజయవాడ: బెజవాడ దుర్గ గుడి లో మూలా నక్షత్ర పూజలు ప్రారంభం అయ్యాయి.ఇంద్రకీలాద్రిపై నిన్న అర్థరాత్రి నుండి సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. చేతిలో బంగారు వీణతో భక్తులకు చదువుల తల్లి గా సాక్షాత్కారం ఇస్తున్న అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్ష్రత్రానికి దసరా శరన్నవరాత్రులలో ఎంతో విశిష్టత ఉంది.తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీ దేవిగా భక్తులను అనుగ్రహించే దుర్గామాతను దర్శించుకునేందుకు ఈ రోజున భక్తులు పోటెత్తుతారు. నవరాత్రులలో మూలా నక్షత్ర రోజు, దసరా(దుర్గాష్టమి ),విజయదశమి చాలా ముఖమైనవి.
ఈరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు మూలా నక్షత్రం రోజున దుర్గగుడిలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం రాష్ట్ర ముఖ్యమంత్రి కి అనవాయితీ గా వస్తోంది. అందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 3:30కు అమ్మవారికి స్వయంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
ఈ రోజు VIP పాసులు బంద్: అధికారులు
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.... ఎన్నడూ లేని విధంగా అమ్మవారి దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారని తెలిపారు. సహజంగా రోజుకు 70 నుంచి 80000 ఉండే భక్తుల సంఖ్య ఇప్పుడు లక్ష దాటిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం, విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం దీనికి కారణం కావచ్చు అని అన్నారు. 36 కంపార్ట్మెంట్ లన్నీ భక్తులతో నిండినట్లు చెప్పారు. పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో అదనంగా ఏపీ ఎస్పీ ప్లటూన్లను రప్పిస్తున్నామని, రోప్ పార్టీలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మొత్తం భక్తులలో విఐపి ల సంఖ్య రెండు శాతం మాత్రమేనని చెప్పారు. సోమవారం విఐపి పాసులు జారీ చేయడం లేదని చెప్పారు. భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా రేపు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్టు చెప్పారు.
దుర్గగుడి ఈవో శీనా నాయక్ మాట్లాడుతూ.. సోమవారం రెండు లక్షల మంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పారు. కుంకుమార్చన, శ్రీ చక్ర నవార్చన వంటి ప్రత్యేక పూజలు చేయించుకునేవారి కోసం భవాని ఘాట్, గాంధీ మ్యూజియం నుంచి వాహనాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 7 నుంచి 8 మధ్య ఆ వాహనాలలోనే దేవస్థానానికి రావాలని, ఇతర వాహనాలను అనుమతించమని చెప్పారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
కృష్ణా నదిలో స్నానాలు వద్దు : ప్రభుత్వ అధికారుల సూచనభారీ వర్షాల దృష్ట్యా కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగిందని, రెండవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని అధికారులు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుడి దర్శనానికి వచ్చి స్నానానికి నదిలో దిగడం వంటివి చేయవద్దని తెలిపారు.