AP CM Chandrababu | విజయవాడ: ‘యుగ పురుషుడు పుడితే చరిత్ర ఎలా మరిచిపోదో, దానికి నిదర్శనం దివంగత ఎన్టీఆర్. గత ఏడాది మొత్తం ఎన్టీఆర్ శత జయంతి జరుపుకున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం జరుపుకుంటున్నాం. మనం చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడమంటే మొత్తం తెలుగు జాతిని గౌరవించడం. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడి సాధిస్తాం’ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలోని పోరంకిలో నిర్వహించిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు ‘తారక రామం- అన్నగారి అంతరంగం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆవిష్కరించారు.
9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక నేత ఎన్టీఆర్
అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చరిత్ర ఉన్నంతవరకు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే వ్యక్తి, తెలుగింటి ఆత్మ గౌరవం, ప్రపంచ వ్యాప్తంగా అదే గుర్తింపు కలిగిన మహా శక్తి ఎన్టీఆర్. పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి రావడం కేవలం ఎన్టీఆర్‌కు సాద్యమైంది. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన చోట సువర్ణాధ్యాయం. ఎన్టీఆర్ నటించిన మన దేశం నటించిన మనదేశం 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. చరిత్రను చూసి స్ఫూర్తిగా తీసుకోవాలి. పల్లెటూర్లో, రైతు కుటుంబంలో నిమ్మకూరులో వెంకట్రావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923 మే 25 జన్మించిన యుగ పురుషుడు ఎన్టీఆర్. చదువు కోసం విజయవాడకు వచ్చానని నాకు చెప్పారు. పాలు అమ్మి తరువాత గుంటూరుకు వెళ్లి చదువుకున్న వ్యక్తి.
దేవుడు అంటే ఎన్టీఆర్ రూపం గుర్తొస్తుంది
1945లో మద్రాసు రైలెక్కాక ఆయన జైత్రయాత్ర ప్రారంభమైంది. సాంఘీక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్. 300 సినిమాల్లో నటించారు. ఆయన ఏడాదికి 10 నుంచి 15 సినిమాలు చేశారు. ఇప్పుడు ఒక్క సినిమాకు మూడేళ్లు పడుతుంది. భారత సినీ చరిత్రలో ఇన్ని సినిమాలు, ఇన్ని విభిన్న పాత్రలు చేసింది ఎన్టీఆర్. వెంకటేశ్వరస్వామి, రాముడు, కృష్ణుడు పాత్రలు అంటే ఆయనే. మనం దేవుడ్ని చూడలేదు. కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడ్ని చూస్తున్నాం. శ్రీరాముడిగా మీరే, రావణుడిగా మీరే చేస్తారు. ఓవైపు కృష్ణుడు, మరోవైపు దుర్యోధనుడిగా ఎలా చేస్తారని అడిగాను. విశిష్టమైన వ్యక్తుల లక్షణాలను గమనించి ఆ పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్.
జోలి పట్టి విరాళాలు సేకరించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్
వీరబ్రహ్మేంద్రస్వామి, కవి సార్వభౌముడు శ్రీనాథుడు లాంటి పాత్రలు సైతం ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా పోషించారు. తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ (TDP) నిలిచి ఉంటుంది. గతంలో రాయలసీమలో కరువు, దివిసీమలో తుపాను వస్తే ప్రముఖ నటుడు అయి ఉండి, జోలి పట్టి ఎండలో వెళ్లి విరాళాలు సేకరించారు. పేదలకు రూ.1కి కిలో బియ్యం అందించిన నేత ఎన్టీఆర్. సభ్యత్వ నమోదు మొదలుపెట్టగా 73 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్. సమాజమే దేవాయలం, ప్రజలే దేవుళ్లుగా భావించి పరిపాలన చేసిన మహనీయుడు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి నేత ఎన్టీఆర్’ అని చంద్రబాబు కొనియాడారు.