Andhra Pradesh CM Chandra Babu: ఏపీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండోసారి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కీలకాంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమైన ఆయన ఏపీ ఆర్థిక వ్యవస్థపై సమగ్రంగా చర్చలు జరిపారు. ఐదేళ్లుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ స్థాయికి దిగజారిందో ఎన్ని అక్రమాలు జరిగాయో సమగ్రంగా వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం సాయం చేయకుండా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందని ఆయన అర్థమయ్యేలా చెప్పారట.
కేంద్రమంత్రి అమిత్‌షా జరిగిన సమావేశ వివరాలను ఎక్స్(X) వేదికగా చంద్రబాబు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేయాల్సిన కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఆర్థిక వ్యవస్థను రూపులోకి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి తొమ్మిదిన్నరకు కేంద్రమంత్రి అమిత్‌షాతో చంద్రబాబు సమావేశమయ్యారు. సుమారు గంట పాటు వీరి చర్చలు సాగాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితులు, విభజన తర్వాత జరిగిన పరిణామాలు, ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యచరణను చర్చించినట్టు పేర్కొన్నారు చంద్రబాబు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, నిధులు ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు.
"ఈరోజు ఢిల్లీలో నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నాను. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దిగజారింది. జరిగిన విధ్వంసకర పరిస్థితిని తెలియజేశాను. 2019-24 మధ్య మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పింది. అప్పులు జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాల గురించి చర్చించాను. గత ప్రభుత్వ ఆర్థిక అసమర్థత, నిర్వహణ లోపం, విచ్చలవిడి అవినీతి కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.
ప్రజలు కూటమికి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాయి. అందరం కలిసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాం." అని చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు. బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని... ఏ మార్గాల్లో నిధులు ఇవ్వాలనే అంశంపై చర్చలు జరపనున్నారు.