Andhra Pradesh CM Chandra Babu: "అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ లు తొలగించం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు " అన్నారు సీయం చంద్రబాబు. తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీనేనని ఆయన అన్నారు. “దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇవ్వనంత స్థాయిలో పెద్ద ఎత్తున పింఛన్లు ఇస్తున్నాం. సామాజిక భద్రత, వృద్ధాప్య పెన్షన్లును రూ 30 నుంచి రూ. 4000 వరకు మనమే తెచ్చాం. ప్రస్తుతం వృద్ధులకు ఇస్తున్న రూ. 4000 పెన్షన్ మొత్తంలో టీడీపీ ప్రభుత్వాలు రూ. 2875 పెంచాయి. దివ్యాంగులకు గత ప్రభుత్వం రూపాయి కూడా పింఛను పెంచలేదు. వైసీపీ ప్రభుత్వానికి నోరెత్తి మాట్లాడే అర్హత లేదు. దివ్యాంగుల పెన్షన్లను రూ. 500 నుంచి రూ. 6000 చేసింది టీడీపీ ప్రభుత్వాలే. అలాగే డయాలసిస్ రోగులకు రూ. 10 వేలకు పెంచింది టీడీపీనే.. ఇస్తోంది టీడీపీనే. మంచానికే పరిమితమైన వారికి పెన్షన్లు ఇవ్వడం మొదలు పెట్టిన టీడీపీ ప్రభుత్వమే.. దాన్ని రూ. 15 వేల వరకు పెంచింది. 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా 1వ తేదీనే ఇస్తున్నాం. ఏడాదికి సుమారు రూ.35 వేల కోట్లు పింఛన్లకే ఖర్చు చేస్తున్నాం.” అని చంద్రబాబు చెప్పారు.
నకిలీ పెన్షన్ లు అందుకే తీసేస్తున్నాం: చంద్రబాబు
“అబద్దాల పునాదుల మీదే వైసీపీ రాజకీయం చేస్తుంది. ఆ పార్టీనే తప్పులు చేస్తుంది... వాటిని ఎదుటివారిపై నెడుతుంది. దీన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్టాలి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనైనా.. గతంలోని ఏ ప్రభుత్వాలైనా ఈ స్థాయిలో పెన్షన్లు ఇచ్చాయా..? ఇవ్వడానికి ఆ ప్రభుత్వాలకు మనస్సు వచ్చిందా..? గత ప్రభుత్వం చాలా మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చింది. దీని వల్ల అర్హులకు నష్టం కలుగుతోంది. ఏ ఒక్క అర్హుడికి నష్టం కలగకూడదంటే అనర్హులను తప్పించాలి. అనర్హులను గుర్తించే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలున్నా.. అధికార యంత్రాంగం పొరపాట్లు చేసినా.. దాన్ని గుర్తించి.. సరిదిద్దే బాధ్యతను పార్టీ యంత్రాంగం తీసుకోవాలి. సీఎంగా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తాను.. ఏమైనా తేడాలుంటే... పార్టీ అధినేతగా పార్టీ యంత్రాంగం ఇచ్చే ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను. ఆ లోపాలను సరిదిద్దుతాను. అర్హుడైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. పింఛన్ అందిస్తాం. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్న వారికి నోటీసులతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలని ఆదేశించాం. ప్రతి ఇంటికీ మనం చేసే మంచి పని చేరాలి. ప్రభుత్వం మంచి చేస్తోంది... ఇబ్బందులున్నా సంక్షేమం అందిస్తుందనే విషయం ప్రజలు అర్థం చేసుకునేలా వివరించాలి.” అని సీఎం సూచించారు.
ప్రజల కోసం రాజకీయం చేయాలి... శాశ్వతంగా నిలవాలి*:సీఎం
“కార్యకర్తలు, నేతలు గట్టిగా పని చేసి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించారు. ఏ ఎన్నిక వచ్చినా కూటమే గెలవాలి. మనం ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించి దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తున్నారు. వారి కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు తాత్కాలిక రాజకీయాలు చేయాలనుకుంటారు.. దీని వల్ల ఇబ్బందులు వస్తాయి. శాశ్వత రాజకీయాలు చేయాలి.. అప్పుడు మనం రాణించగలం. జిల్లా కమిటీల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తైంది. త్వరలో ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తాం. పని చేసే నాయకత్వానికి పెద్దపీట వేస్తాం. కార్యకర్తల్లో మరిన్ని నాయకత్వ లక్షణాలు పెంచుతాం. ఆర్థికంగా బలోపేతం చేస్తాం.” అని చంద్రబాబు వెల్లడించారు.