Highlights of Andhra Pradesh Cabinet | అమరావతి: ఏపీ ప్రభుత్వం విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ మంత్రివర్గం సమావేశంలో వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్న పేరును వైసీపీ హయాంలో సీఎం జగన్.. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం వివాదాస్పదం కావడం తెలిసిందే. 


ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 1986లో ఓ చట్టం ద్వారా అప్పటి ప్రభుత్వం మెడికల్ కాలేజీ తీసుకొచ్చింది. 1998లో ఆ చట్టాన్ని సవరించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. అన్ని మెడికల్ సర్వీసులు ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేసి ఆరోగ్య విశ్వవిద్యాలయంగా చేసి  సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. 2006లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


కానీ గత వైసీపీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం తెలిసిందే. ఇక్కడ చదువుకుని ఉత్తీర్ణత సాధించిన కొందరు డాక్టర్లకు సర్టిఫికెట్లలో వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ అని, కొందరికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని.. కొన్నేళ్లు ఎన్టీఆర్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు, కొంతకాలం వైఎస్సార్ హెల్త్ వర్సిటీ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం వారిలో ఆందోళన పెంచిందన్నారు. పలువురు నేతలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.
Also Read: AP Cabinet Decisions: జులై 1న ఇంటివద్దే రూ.7 వేల పింఛన్ పంపిణీ, వాలంటీర్లతో కాదని చెప్పిన ఏపీ మంత్రి పార్థసారథి



డీఎస్సీ పోస్టుల భర్తీకి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, స్కిల్ డెవలప్ మెంట్ తో యువతకు నైపుణ్య శిక్షణ, సామాజిక భద్రత పెన్షన్లు పెంపు లాంటి నిర్ణయాలను రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. వీటితో పాటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటీగా విజయవాడలోని హెల్త్ వర్సిటీ పేరును మార్చాలని నిర్ణయించారు. ఏపీలో గంజాయి అరికట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గంజాయి నియంత్రణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు లోకేశ్, అనిత, సంధ్యారాణి, సత్యకుమార్, కొల్లు రవీంద్రలతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.