TDP MLAs has been Suspended by Speaker From Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ గట్టిగా డిమాండ్ చేసింది. పేపర్లు చింపి విజిల్స్ వేస్తూ టీడీపీ సభ్యుల ఆందోళన చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గించారు. అందుకే వారిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు స్పీకర్. 


రెండో రోజు సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. సభాపతి పలు మార్పు వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్య వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానపై చర్చను ప్రారంభించాలని ఆదేశించారు. 


వాయిదా తీర్మానాలు తిరస్కరించడాన్ని టీడీపీ సభ్యులు తప్పుపట్టారు. నిత్యవసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అందుకే ధరల అంశాన్ని ప్రాధాన్య క్రమంలో తీసుకోవాలని పట్టుపట్టారు. ఈ డిమాండ్‌తోనే అసెంబ్లీ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అక్కడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజిల్స్ వేశారు. 


సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తించిన తీరును వైసీపీ సభ్యులు తప్పుపట్టారు. రెడ్‌లైన్ దాటిన వారిపై వేటు వేయాలని డిమాండ్ చేశారు. అనుచిత ప్రవర్తన సరికాదని హెచ్చరించారు. వారి ప్రవర్తన ప్రజలు చూస్తున్నారని వారిని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపిస్తారని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు... ప్రజాసమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అందుకే జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుపై చర్చించినా ఓర్వలేకపోతున్నారని అన్నారు. సంప్రదాయాలు పాటించడంలేదని... స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లడమే తప్పనుకుంటే.. ఆయనపై పేపర్లు చించి వేయడం ఏంటని ప్రశ్నించారు. 


మధ్యలో అంబటి రాంబాబు కూడా లేచి టీడీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను రెచ్చగొట్టొద్దని సూచించార. స్వచ్ఛందంగా వాకౌట్ చేసి వెళ్లిపోవడమా... స్పీకర్‌తో వేటు వేయించుకొని వెళ్లడమా.. మార్షల్స్‌తో నెట్టించుకోవడమా అనే ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. వాళ్లుకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవాలని సూచించారు. మొదటి రోజు నుంచి ఇదే తీరున టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు.


ప్రస్తుతం ఈ విడతలో ఆఖరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. రేపు ఉదయం సభ ముందుకు బడ్జెట్ తీసుకురానున్నారు ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి. ఈ సమావేశాల్లో మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రసంగించారు. ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్ర పథాన నిలిపేందుకు నిర్విరామంగా కృషి చేస్తోందని తెలిపారు. 


మొదటి రోజు కూడా టీడీపీ సభ్యులు సభను వాకౌట్ చేశారు. గవర్నర్‌తో ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని ఆరోపిస్తూ సభ నుంచి బయటకు వచ్చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ప్రజలకు మేలు చేయాల్సిన సర్కారు ఇలా కీడు చేస్తూ సభలో కీర్తించుకుంటోందని మండిపడ్డారు.