Bird Flue In Andhra Pradesh : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా బర్డ్‌ఫ్లూ భయపెడుతోంది. లక్షల్లో కోళ్లు మృతి చెందాయని ప్రచారం జరుగుతోంది. దీన్ని ఏపీ పశుసంవర్ధక మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. పది రోజుల క్రితం బర్డ్‌ఫ్లూ వచ్చిన మాట వాస్తమేనని అంగీకరించారు. కానీ ఇప్పుడు ఆ వ్యాధి పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం బర్డ్‌ఫ్లూ లేదని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు... ఈ వ్యాధి గురించి ఆందోళన వద్దని సూచించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి భయపడిపోవద్దని హితవు పలికారు. వేడి వాతావరణం పెరుగుతున్నందున ఎలాంటి సందేహం లేకుండా కోడి మాంసం, గుడ్లు తినొచ్చని అన్నారు.
బర్డ్‌ఫ్లూ ఎటాక్ అయిందిన ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశామన్నారు. రాష్ట్రంలో 2కోట్ల 32 లక్షల 53 వేలు నాటు కోళ్లు ఉన్నాయని వివరించారు. లేయర్స్ అండ్ బాయిలర్స్ కోళ్లు 8కోట్ల 46 లక్షల 9 వేలు ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా 10 78 63 152 కోళ్లు ఉంటే అందులో కేవలం ఏడు లక్షలకుపపైగా కోళ్లకే బర్డ్‌ఫ్లూ సోకిందని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా బాదంపూడిలో రెండు లక్షల కోళ్లు చనిపోయినట్టు సమాచారం వచ్చిందని అచ్చెన్న తెలిపారు. వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూరులో ఐదు లక్షల కోళ్లు. ఎన్టీఆర్ జిల్లా గంపగూడెంలో ఏడు వేల కోళ్లు, వెస్ట్ గోదావరి కానూరులో అరవై ఐదు వేలు కోళ్లు చనిపోయినట్టు సమాచారం అందిందన్నారు. ఇంతకు మించిన కోళ్లు చనిపోయినట్టు రిపోర్టు కాలేదని పేర్కొన్నారు.
Also Read: కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ సంకోచం - బిల్లులు, బెట్టింగ్ బాధితుల భయమా ?
విషయం తెలిసిన వెంటనే కోళ్ల శాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపిస్తే బుధవారం రిపోర్టు వచ్చిందని అచ్చెన్న తెలిపారు. ఆ రిపోర్టును చూసి కొత్తగా వచ్చిందన్న ప్రచారం జరిగిందన్నారు. పది రోజుల క్రితం చనిపోయిన కోళ్ల రిపోర్టు మాత్రమే అని అన్నారు. కొద్ది రోజుల నుంచి బర్డ్‌ఫ్లూతో కోళ్లు చనిపోయినట్టు మాత్రం రిపోర్టు నమోదు కాలేదని వివరించారు.
తెలంగాణ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు ఏపీ కోళ్లను, గుడ్లను బ్యాన్ చేసినట్టు తెలిసిందని వారితో మాట్లాడుతున్నట్టు అచ్చెన్న తెలిపారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు నలభై లక్షల కోళ్లు చనిపోతే ఎక్కడ పూడ్చాలని ప్రశ్నించారు. అలా పూడ్చిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా ఎలా ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని భయం లేకుండా కోళ్లు గుడ్లు తినొచ్చని భరోసా ఇచ్చారు.
పౌల్ట్రీల వద్ద పరిశుభ్రత పాటించకపోవడంతో బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందిందన్నారు అచ్చెన్న. వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే ఆ పౌల్ట్రీకి సమీపంలో పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న షాపులు మూసివేయించామన్నారు. ప్రజల్లో భయాందోళనకు లేకుండా ఉండేందుకు ఆ పౌల్ట్రీల్లో ఇంకా బతికే ఉన్న కోళ్లను, గుడ్లను పూడ్చిపెట్టామన్నారు. వ్యాధి వచ్చిన పౌల్ట్రీలను రెడ్‌జోన్‌లో ఉంచినట్టుు వెల్లడించారు.
డబ్బై డిగ్రీల సెల్సియస్ వద్ద బర్డ్‌ఫ్లూ మనుగడ సాగించలేదని అన్నారు అచ్చెన్న. కోడి గుడ్డు ఉడకబెట్టినా, కోడి మాంసం వండినా అంత కంటే ఎక్కువ టెంపరేచర్‌లోనే కుక్ చేస్తామన్నారు. అంటే డెబ్బై కంటే ఎక్కువగానే ఆ టెంపరేచర్ ఉంటుందని ఆ ఉష్ణోగ్రతలో బర్డ్‌ఫ్లూ ఉండదని స్పష్టం చేశారు. అందుకే ఎలాంటి సందేహం భయం లేకుండా కోళ్లు,కోడి గుడ్లు తినొచ్చని ప్రకటించారు.
Also Read: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు