Amaravati Seed Access Road: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కలల సాకారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలో రవాణా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సీడ్ యాక్సెస్‌ ఇ-3 రోడ్డు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక రహదారిని, అలాగే బకింగ్‌హామ్‌ కెనాల్‌పై నిర్మించిన ఆధునిక స్టీల్ బ్రడ్జిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభించడానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. దీన్‌ని A అక్షరం మోడల్‌లో రూపొందించారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, నాదెండ్ల మనోహర్‌తోపాటు రాజధాని రైతులు, కూటమి నేతలు పాల్గొన్నారు. 

Continues below advertisement

ఏంటీ ఇ-3 రోడ్డు 

అమరావతి రాజధాని నగరంలో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న రహదారు నెట్‌వర్క్‌లో ఇ-3 అత్యంత కీలకమైంది. ఇది కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, అంతకు మించింది. 

ఈ రోడ్డు  మొత్తం 21.77 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీని నిర్మాణం కోసం ప్రభుత్వం సుమారు 1,519 కోట్లను ఖర్చు చేసింది. ఈ రోడ్డు దొండపాడు వద్ద ప్రారంభమై, రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేప్లి మీదుగా ప్రయాణించి, మణిపాల్ హాస్పిటల్స్ వద్ద జాతీయ రహదారి-16ను కలుపుతుంది. 60 మీటర్ల వెడల్పుతో, మూడు దశల్లో ఈ కారిడార్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో 9 లేన్ల రహదారితోపాటు, భవిష్యత్‌ ప్రజా రవాణా కోసం ప్రత్యేకంగా బీఆర్టీఎస్‌ కారిడార్‌ను కూడా కేటాయించారు. 

Continues below advertisement

ఎందుకు ఈ ప్రాజెక్టు కీలకమైందిగా చెబుతున్నారు? 

రాజధాని అమరావతిని ఒక ఆధునిక నగరంగా తీర్చిదిద్దడంలో రవాణా సౌకర్యాలు చాలా అవసరం. అందుకే అమరావతిలోని ఎన్‌1 నుంచి ఎన్17 వరకు ఉన్న అన్ని రోడ్లను ఈ E-3 రహదారి కలుపుతుంది. ఇది రాజధానిలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలను సులభతరం చేస్తుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే వాహనాలన్నీ కరకట్ట రోడ్డుపైనే ఆధారపడుతున్నాయి. దీని వల్ల ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోంది. ఇ-3 రహదారి, కొత్తగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడం వల్ల కరకట్టపై భారం తగ్గి, వాహనాలు వేగంగా రాజధానిలోకి చేరుకుంటాయి. ఈ రోడ్డు నిర్మాణం కేవలం ప్రయాణం కోసమే కాదు, దీనితోపాటు డ్రైనేజీ, మంచినీటి సరఫరా, గ్యాస్‌పైప్‌లైన్లు, విద్యుత్ నెట్‌వర్క్‌లకు అవసరమైన మౌలిక వసతులను భూగర్భంలోనే ఏర్పాటు చేశారు. 

బకింగ్‌హామ్ కెనాల్‌ స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకత ఏంటీ?

ఇ-3 రహదారిని విజయవాడ- మంగళగిరి హైవేతో కనెక్ట్ చేయడంలో బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జి కీలక పాత్ర పోషిస్తుంది. సుమారు 82 కోట్లతో 478 మీటర్ల పొడవున నాలుగు వరుసలతో వంతెన నిర్మించారు. ఈ వంతెన ద్వారా వాహనదారులు విజయవాడ నుంచి నేరుగా సీడ్ యాక్సెస్‌ రోడ్డులోకి ప్రవేశించి రాజధాని అమరావతికి చేరుకోవచ్చు. 

భవిష్యత్ ప్రణాళిక ఏంటీ?

అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 34 ప్రధాన రహదారులను, సుమారు 350 కిలోమీటర్ల మేర నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్‌లో పెరగనున్న జనాభా, ట్రాఫిక్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని గ్రిడ్ తరహాలో రోడ్డు  నిర్మాణం జరుగుతోంది. అనవసర మలుపులు లేకుండా, తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ రోడ్డు వ్యవస్థ ఉండబోతోంది. 

ఇ-3 రోడ్డు వెంటనే సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, గ్రీన్ బెల్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనిని పర్యావరణ హితమైన గ్రీన్ కారిడార్‌గా తీర్చిదిద్దనున్నారు. రాజధాని పునర్మిర్మాణ వేగానికి ఈ ప్రారంభోత్సవం ఒక బలమైన సంకేతకంగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది.