Flights Landing On Road: ఏపీలో రోడ్డుపైనే దిగనున్న విమానాలు, ఈనెల 29నే - ఎక్కడో తెలుసా?

తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్ విమానాలు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై అత్యవసర ల్యాండింగ్‌ చేశారు.

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారిపై విమానాలు ల్యాండ్ కానున్నాయి. 16వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ - ఒంగోలు మధ్య ఈ డ్రిల్ జరగనుంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విమానాల ల్యాండింగ్ కు అనుకూలంగా ఉండేలా నేషనల్ హైవేలో కొంత మేర మార్పులు చేసింది. ఈ ఎయిర్‌ ప్యాడ్‌ పైన ఈ నెల 29న విమానాలు దిగనున్నాయి. బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రేణింగవరం, కొరిశపాడు గ్రామాల మధ్య నుంచి వెళ్తున్న 16వ నెంబరు జాతీయ రహదారిపై అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు 4 కిలో మీటర్ల మేర సిమెంటు రోడ్డు వెడల్పుగా నిర్మించారు. డిసెంబరు 29న ఉదయం 11 గంటలకు ట్రయల్‌ రన్‌లో భాగంగా ఒక కార్గో విమానం, రెండు జెట్‌ ఫైటర్‌లు దిగుతాయని జిల్లా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్లు హైవే వారు వెల్లడించారు.

Continues below advertisement

రోడ్లపై దిగడం ఎందుకు?
తొలిసారిగా 2017 అక్టోబర్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్ విమానాలు, రవాణా విమానాలను ప్రయోగాత్మకంగా లక్నో - ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ మార్గంపై అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా వివిధ చోట్ల ఈ తరహా సదుపాయాలను మెరుగు పరుస్తున్నారు. భూకంపాలు, వరదలు లాంటివి లేదా ఇంకేవైనా ప్రకృతి విపత్తులు సంభవించిన సందర్భంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎయిర్ స్ట్రిప్‌లను వాడుకోనున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రెండు మార్గాల్లో
అత్యవసర పరిస్థితుల్లో ఈ ఎయిర్ స్ట్రిప్‌లను వినియోగించుకొనేందుకు వీటిని నిర్మిస్తున్నారు. యుద్ధ విమానాలను అత్యవసర పరిస్థితుల్లో క్షేమంగా నేలపైకి దించడానికి కొన్ని జాతీయ రహదాలను ఎంపిక చేసి వాటిలో కొంత దూరం మేర మార్పులు చేస్తున్నట్లు గతంలో ఓ సారి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల్లో 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు - ఒంగోలు, ఒంగోలు - చిలకలూరి పేట మార్గాలను అభివృద్ధి చేస్తామని గతంలోనే వెల్లడించారు. 

రోడ్లపై అత్యవసర ల్యాండింగ్‌ సౌకర్యం అనేది యుద్ధ సమయాల్లోనే కాకుండా వరదలు లేదా ఇతర విపత్తుల సమయంలోనూ బాగా ఉపయోగపడుతుందని ఆ సందర్భంగా మరో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. 

అదే క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన యుద్ధ విమానాలను జాతీయ రహదారులపై దించే ప్రక్రియలను గతేడాది కూడా కొన్ని చోట్ల చేశారు. విమానాల అత్యవసర ల్యాండింగ్‌ కోసం రాజస్తాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో జాతీయ రహదారి - 925 ఏపై సిద్ధం చేసిన సట్టా - గాంధవ్‌ స్ట్రెచ్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కరీ గత ఏడాది సెప్టెంబర్‌ నెలలో ప్రారంభించారు. ఐఏఎఫ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అభివృద్ధి చేసిన మొట్టమొదటి రహదారి ఇదే. సట్టా - గాంధవ్‌ స్ట్రెచ్‌ను నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా 19 నెలల్లో మార్పులు చేసి అభివృద్ధి చేసింది.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ రహదారులు, జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌ఎస్‌ బదౌరియాలతో కూడిన ఓ యుద్ధ విమానం సట్టా - గాంధవ్‌ జాతీయ రహదారి స్ట్రిప్ పై విజయవంతంగా దిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ ట్రయల్ డ్రిల్‌ను చేపట్టగా.. అనంతరం సుఖోయ్‌, ఏఎన్‌–32 మిలటరీ రవాణా విమానాలు, ఎంఐ–17వీ5 హెలికాఫ్టర్‌ లు లాంటి వాటిని కూడా అత్యవసర ల్యాండింగ్‌ చేసే డ్రిల్ చేపట్టారు.

ఖర్చు ఎంత అవుతుందంటే..
అత్యవసర ల్యాండింగ్‌ కోసం సట్టా - గాంధవ్‌ మార్గంతోపాటు గగారియా - బఖాసర్‌ మార్గాన్ని రూ.765.52 కోట్లతో అభివృద్ధి చేశారు. అత్యవసర సమయాల్లోనే విమానాల ల్యాండింగ్‌ కోసం వీటిని వాడతారు.

Continues below advertisement