బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కదులుతున్న బస్‌కు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా బస్ కాలి బూడిద అయింది. అప్పటికే అందులో ప్రయాణిస్తున్న విద్యార్థులు చాకచక్యంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
బాపట్ల జిల్లాకు చెందిన ఐఆర్‌ఈఎఫ్ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పరీక్షల కోసం గుంటూరు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న బస్ ప్రమాదానికి గురైంది. చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్దకు రాగానే విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్‌కు మంటలు అంటుకున్నాయి.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజిన్ నుంచి మంటలు వచ్చి బస్ దగ్ధమైంది. ఓ వైపు బస్‌లో మంటలు చెలరేగుతుండగానే మరోవైపు నుంచి విద్యార్థులు దిగారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ బస్‌లో 30 మంది విద్యార్థులు ఉన్నారు.
ఓవైపు మంటలు, మరోవైపు బస్ మొత్తం పొగలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అతికష్టమ్మీద బస్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్ కాలి బూడిద అయినా విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బస్‌లో షార్ట్ సర్క్యూట్ అయిన తర్వాత మంటలు చెలరేగిందని తెలుసుకున్నడ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని పక్కకు నిలబెట్టాడు. విద్యార్థులను అప్రమత్తం చేశాడు. తర్వాత స్థానికుల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకొని మంటలు ఆర్పారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడకు చేరుకునే సరికి బస్ పూర్తిగా దగ్ధమైంది.
Also Read: అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?