Vijayawada News : కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర దాడికి గురైన మహిళను గద్దె రామ్మోహన్ పరామర్శించారు. విజయవాడ రాణిగారితోటలో గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన మహిళ దేవినేని అవినాశ్ కు సమస్యలు చెబితే వారిపై వైఎస్సార్సీపీ నాయకులు దాడులు చేస్తారా? అంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. ఇంటిలో నిద్రిస్తున్న మహిళపై వైఎస్సార్సీపీ నేతలు దాడులు చేయడం ఎంత వరకు సబబు మండిపడ్డారు. ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ లేదా పార్టీ నాయకులు అయినా ప్రజల్లో పర్యటిస్తున్నప్పుడు స్థానికులు వారి సమస్యలు చెబుతారని, కొన్ని సందర్భాల్లో నిలదీస్తారని, ప్రజలు చెప్పిన సమస్యలను విని వాటిని పరిష్కరించాలే కానీ ఈ విధంగా సమస్యలు చెప్పిన వారిపై దాడులు చేసి వారిని భయభ్రాంతులను చేయడం సరికాదని గద్దె రామ్మోహన్ అన్నారు. దాడులు, దౌర్జన్యాలు చేసే వారినే మంచి నాయకుడిగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ గుర్తించి ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గెలుపునకు పనిచేస్తే తమను ఎందుకు పట్టించుకోవడంలేదని అడిగినందుకే దాడులు చేశారని, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు.
బాధితులు వైసీపీ వాళ్లే
వైసీపీ మహిళలు దాడి ఘటనలో పోలీస్ స్టేషన్ లో ఉన్న బాధితులను వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి పరామర్శించారు. బాధితులు వైసీపీకి చెందినవాళ్లే అని యలమంచలి రవి అన్నారు. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలే కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు. చాలా విషయాలు మాట్లాడుదామనుకున్నా అని, సొంత పార్టీ అవడం వల్ల మాట్లాడలేకపోతున్నా అన్నారు. సొంత పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తేనే కొడతారా? అని ప్రశ్నించారు. కొట్టినవాళ్లలో ఆ డివిజన్ మహిళల కన్నా వేరే ప్రాంతం వాళ్లు ఉన్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రశ్నించారు కాబట్టే కొట్టారని, వాళ్లంతా వైసీపీలో పని చేసిన వారే అన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకెళతా అన్నారు.
కేసు వెనక్కి తీసుకోమని బెదిరింపులు
కృష్ణలంక పోలీస్టేషన్ లో బాధితులను పరామర్శించారు జనసేన నేత పోతిన వెంకట మహేష్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ రసవత్తరంగా రాజకీయం జరుగుతుందన్నారు. గడపగడపకూ వెళ్లి వైసీపీ నేతలు ప్రజలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లిని గతంలో చూశామని, తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి దాడి చేశారన్నారు. పెన్షన్ అడిగితే ఇళ్ల మీద పడి కొడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్ రౌడీయిజాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఇంత బహిరంగంగా దాడి చేస్తుంటే పోలీసు కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవలే అవినాశ్ కి మద్దతు ఇవ్వాలన్నారని, ఇలా దాడులు చేస్తే ప్రజలు మీకు ఎలా మద్దతు ఇస్తారన్నారు. గాయాలతో బాధితులు పోలీస్టేషన్ లో ఉంటే వాలంటీర్ తో ఫోన్ చేయించి బెదిరించారని ఆరోపించారు. కేసు వెనక్కి తీసుకోకపోతే ఫాతిమా, రమీజాల ఇల్లు రద్దు చేస్తామని బెదిరించారన్నారు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి ప్రజా పాలన అని నిలదీశారు. ప్రజలు తప్పకుండా జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని పోతిన మహేశ్ అన్నారు.