Chandrababu: వివేకా హత్య, కోడి కత్తి వ్యవహారాలతో సానుభూతి పొంది వైసీపీ ఓట్లు వేయించుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు వాస్తవాలు వివరించి వైసీపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న తప్పులన్నింటికీ చంద్రబాబే కారణమంటూ వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వివేకానంద రెడ్డిని చంపి గుండెపోటు అని ఎవరు ప్రచారం చేశారని ప్రశ్నించారు. కోడి కత్తి నాటకాలు ఆడారని, ఇప్పుడు కోడి కత్తి ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.






టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి 


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సోమవారం పోలవరం నిర్వహించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిగెత్తించి 72 శాతం పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో టీడీపీపై ఆరోపణలు చేశారని, వాటిల్లో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారన్నారు.  ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు వేయించుకుంటారా? ఓట్ల కోసం ప్రాంతాలు, కులాలు, మతాలను రెచ్చగొడతారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 


టీడీపీపై విష ప్రచారం 


వైసీపీ పాలనపై ప్రజలకు వివరిస్తామని, ప్రజా వ్యతిరేక పాలనపై నిలదీస్తామని చంద్రబాబు(Chandrababu) అన్నారు. పేటీఎం బ్యాచ్‌ను అడ్డుపెట్టుకుని టీడీపీపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కష్టాలను వెలుగులోకి తీసుకురావాలని ఐ-టీడీపీ సభ్యులకు చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. ఐ-టీడీపీ సభ్యులపై ఎన్నో అక్రమ కేసులు పెట్టారని, టీడీపీ(TDP) అధికారంలోకి రాగానే అక్రమ కేసులను రద్దు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాంతాలపై మాట్లాడతారన్నారు. సమర్థులు అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారని చంద్రబాబు అన్నారు. తెలుగు ప్రజలే తన కులం, మతం, తన కుటుంబసభ్యులన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఐ-టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. సెల్‌ఫోన్లే ఐటీడీపీ కార్యకర్తల ఆయుధాలన్నారు. నిజాల వెలికితీతలో కార్యకర్తలు ముందుండాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. అవాస్తవాలు, తప్పుడు ప్రచారాలు నమ్మి జగన్‌(Jagan)ని ప్రజలు గెలిపించారని, వాస్తవాలు ప్రచారం చేసి ముందుకెళ్లాలని సూచించారు. వాస్తవాలను ప్రజల ముందుంచి వైసీపీ అడ్రస్సు లేకుండా చేయాలన్నారు.