Vijayawada Job Mela: సాధారణంగా పోలీసులు రౌడీ షీటర్లకు అప్పుడప్పుడూ కౌన్సిలింగ్ ఇస్తుంటారు. కానీ విజయవాడ పోలీసులు(Vijayawada Police) మరో అడుగు ముందుకేశారు. వినూత్నంగా ఆలోచించి రౌడీ షీటర్లలో మార్పు తీసుకొచ్చేందుకు వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. రౌడీ షీటర్ల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా(Job Mela) నిర్వహిస్తున్నారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో
నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తుంటారు. కానీ రౌడీ షీటర్ల కోసం జాబ్ మేళా ఎక్కడైనా విన్నారా, కచ్చితంగా విని ఉండరు. విజయవాడ పోలీసుల వినూత్న నిర్ణయం రౌడీ షీటర్లకు జాబ్ మేళా ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్ గా మారింది. నగరంలోని సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో నార్త్ డివిజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల(Rowdy Sheeter)కు జాబ్ మేళాలో అవకాశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరస్థులలో మార్పు తీసుకొచ్చే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. రౌడీ షీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఈ జాబ్ మేళా దోహదపడుతుందని డీసీపీ బాబురావు అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి(Skill Development Corporation) సంస్థతో కలసి వచ్చే శనివారం ప్రత్యేకంగా జాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
రౌడీ షీట్ తొలగించి ఉద్యోగావకాశం
విజయవాడ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని డీసీలు, బీసీలు, సస్పెక్ట్ లు, రౌడీషీటర్లకు ఇన్స్పెక్టర్లు కౌన్సెలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా వారితో గంజాయి, గుట్కా, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటుగా నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్లకు వారి రౌడీ షీట్ లను తీసి వేసి ఉపాధి అవకాశం కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తామని విజయవాడ వెస్ట్ జోన్ డీసీపీ బాబురావు తెలిపారు.