PM Modi Black Balloons : ఏపీలో తాజాగా నల్ల బెలూన్ల రాజకీయం నడుస్తోంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. ఆ సమయంలో కొందరు నేతలు నల్ల బెలూన్లను ప్రధాని మోదీ హెలికాఫ్టర్ లో వెళ్తున్న సమయంలో గాలిలోకి వదిలారు. దీంతో ఈ వ్యవహారంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. ప్రధాని భద్రతకు ముప్పు కలిగించేలా నల్ల బెలూన్లు వదిలారని బీజేపీ నేతలు మండిపడుతున్నాయి. దీనికి భద్రత లోపమే కారణమన్నారు. అయితే పోలీసులు మాత్రం భద్రతా లోపంలేదని అంటున్నారు. 


భద్రతా లోపం లేదు-పోలీసులు 


ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో భ‌ద్రతా లోపం వ్యవ‌హ‌రం క‌ల‌క‌లం రేపింది. ప్రధాని మోదీ గ‌న్నవ‌రం నుంచి భీమ‌వ‌రం హెలికాఫ్టర్ లో వెళ్తుండగా ఆకాశంలో న‌ల్ల బెలూన్లు ఎగ‌ర‌టంపై కేంద్ర ఉన్నతాధికారులు సీరియ‌స్ అయ్యారు. దీనిపై రాజ‌కీయ ర‌గ‌డ మొద‌ల‌వ‌టంతో ఈ ఘ‌టనపై విచార‌ణ చేప‌ట్టామ‌ని పోలీసులు వెల్లడించారు. ఎక్కడో నాలుగు కిలోమీట‌ర్ల దూరంలో బెలూన్లు ఎగ‌ర వేస్తే భ‌ద్రతాలోపం అన‌టం త‌ప్పు అని పోలీసులు వ్యాఖ్యానించారు. నల్ల బెలూన్లను ఎగరవేయడంపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ విజయ్‌పాల్‌ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. గన్నవరం పోలీసు స్టేషన్‌లో పోలీసు అధికారులతో డీఎస్పీ విజయ్ పాల్ సమీక్షించారు. నల్ల బెలూన్లను ఎగరవేయడాన్ని ఎస్పీ జాషువా తీవ్రంగా పరిగణించారని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు ఉన్నారని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ రతన్‌ నల్ల బెలూన్లు ఎగరవేసినట్టుగా గుర్తించారు.  పరారీలో ఉన్న రాజీవ్‌ కోసం పోలీసులు గాలిస్తు్న్నారు. బెలూన్లను ఎగరవేసిన వారిలో కాంగ్రెస్‌ నేత సుంకర పద్మశ్రీతో పాటు మరికొంత మంది మహిళలను పోలీసులు అదపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


ఎవరి పనో తెలుసు-సోము వీర్రాజు 


నల్ల బెలూన్ల వెనుక ఎవరున్నారో తమకు తెలుసని బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. చ‌ట్టంలోని అంశాల‌ను ప్రస్తావించటం స‌రికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. కొంత మంది ద‌మ్ము ధైర్యం లేక‌ పిరికి పంద‌లు నల్ల బెలూన్లు ఎగరవేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ హెలికాప్టర్ ఎగురుతుంటే న‌ల్ల బెలూన్లు ఎగ‌ర‌వేయ‌టాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఏ రాజకీయ పార్టీ ఎం మాట్లాడుతుందో మాకు తెలుస‌ని, రాష్ట్ర అంశాలపై బ‌హిరంగ చ‌ర్చకు సిద్ధమ‌ని స‌వాల్ విసిరారు. మోదీ హెలికాప్టర్ ఎగురుతుంటే, నల్ల జెండాలు ఎగ‌ర వేయ‌టం ఏంటని నిల‌దీశారు.