Pawan Kalyan : ముద్దుల మావయ్య సీఎం జగన్ విదేశాల్లో తిరుగుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కట్టడంలేదని ఆరోపించారు. విదేశీ విద్యకు డబ్బులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. పేద ప్రజల నుంచి రూ. లక్ష కట్టించుకున్న టిడ్కో ఇళ్లు ఇవ్వలేదన్నారు. మంత్రి రోజా తనను తిట్టడంపై పెట్టిన శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై పెట్టాలన్నారు. వైసీపీ ఏపీ ప్రజలకు హానికరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. పిడుగురాళ్లలో భూసేకరణ చేసి ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం వేధిస్తోందని పవన్ ఆరోపించారు.
వైసీపీ ఏపీకి హానికరం
ఏపీకి వైసీపీ హానికరమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఏ ఒక్కరితో మార్పు రాదని, చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ప్రతి గ్రామంలో పట్టుమని పది మంది ఉండాలన్నారు. రాష్ట్రానికి బలమైన నేతలు ఉంటే తప్ప సమస్యల నుంచి బయటకు రాలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస పాలన నుంచి బయటపడేయాలంటే బలమైన నాయకులు కావాలన్నారు. విజయవాడలో జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
బూతులు తిట్టేందుకు ప్రెస్ మీట్లు
ప్రెస్ మీట్స్ పెట్టి బూతులు తిట్టడానికి వైసీపీ ఎమ్మెల్యేలకు సమయం ఉంటుంది కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి మాత్రం ఓపిక లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పండుగలు, పుట్టినరోజులు రకరకాల సంబరాలకు వారికి సమయం ఉంటుందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ నేతలు సమయం కేటాయించేలా వారిపై ఒత్తిడి రాకపోతే మార్పు రావడం కష్టమన్నారు. అన్యాయం జరిగిన వ్యక్తుల పక్షాన నిలబడేందుకు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, కౌలు రైతుల సమస్యలతో పాటు టిడ్కో ఇళ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్యా పథకం సహా అనేక అంశాలపై ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్పందన కార్యక్రమం విజయవంతం అయితే ఇవాళ ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించే శక్తి తనకు లేకపోయినా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు.