Kodikathi Case : కోడికత్తి కేసుపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌ ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్‌లో విచారించింది కోర్టు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్... ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ చేపట్టాలని సీఎం జగన్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. అయితే ఈ కేసును విచారించిన న్యాయమూర్తి ఇటీవల బదిలీ అయ్యారు. ప్రస్తుత న్యాయమూర్తి.. ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టకపోవడంతో... కేసు విచారణను మే 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో సీఎం జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరు కాలేనని ఒకటి, అడ్వకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేసి విచారించాలని మరో పిటిషన్  వేశారు. అయితే ఈ పిటిషన్లపై నిందితుడి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే విధంగా ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ జరపలేదని,  మరొకసారి పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సీఎం తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఈ రెండు పిటిషన్లపై గురువారం విచారణ జరగాల్సి ఉన్నా...తాత్కాలిక న్యాయమూర్తి పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించిత తర్వాత విచారణ చేపడతామని పేర్కొంటూ మే 10కి విచారణ వాయిదా వేశారు. ఇంతకుముందు ఈ కేసును విచారణ చేసిన న్యాయమూర్తి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయ్యారు. 


గత విచారణలో వాదనలు


గత విచారణలో  కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు కోరుతూ సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.  సీఎం జగన్ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు గత విచారణలో వాదనలు వినిపిస్తూ.. ఒకే రోజున 35 మంది సాక్ష్యులను అధికారులు విచారించారని తెలిపారు. మూడు బృందాల అధికారులు ఈ విచారణ జరిపారన్నారు. ఎన్ఐఏ ఛార్జ్ షీట్ చదివితే తదుపరి దర్యాఫ్తు అవసరమని సాధారణ పౌరుడికి సైతం అర్థమవుతుందన్నారు. సీఎం జగన్ వాంగ్మూలాన్ని అదనపు ఎస్పీ తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. జన్మభూమి కమిటీ సిఫార్సుతో నిందితుడు శ్రీనివాసరావుకు తానేకంక గ్రామంలో ఇంటి స్థలం వచ్చిందని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. నిందితుడు శ్రీనును పథకం ప్రకారమే టీడీపీ నేత హర్ష వర్ధన్ చౌదరి రెస్టారెంట్ లోకి తీసుకెళ్లారన్నారు. నిందితుడి గ్రామంలోని ఫ్లెక్సీపై సినీనటుడు ముందుగా చెప్పిన గరుడ ఫొటో ఎందుకు వచ్చిందని వాదించారు. నిందితుడు శ్రీనివాస్ పై కేసు ఉన్నప్పటికీ విశాఖ ఎయిర్ పోర్టు అథారిటీ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా జారీ చేసిందో విచారణ జరపాలని కోర్టును కోరారు. ఫుడ్ అండ్ ఫ్యూజన్ అధినేత, టీడీపీ సానుభూతిపరుడు హర్షవర్థన్‌ చౌదరిని ఎన్ఐఏ విచారించలేదన్నారు. ఎన్ఐఏ మొదటి పిటిషన్ వేసిన తర్వాత మరలా ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని కోర్టుకు తెలిపారు. బాధితునిగా సీఎం జగన్‌కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉందని వాదనలు వినిపించారు. 


జగన్ కోర్టుకు హాజరుకావాల్సిందే? 


మరో వైపు తాను కోర్టుకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ పైనా  నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరపున వాదిస్తున్న లాయర్ సలీం గత విచారణలో వాదనలు వినిపించారు.  కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వడానికి ట్రాఫిక్ కారణం  అని సీఎం జగన్ చెప్పడం సమంజసం కాదన్నారు.  వివాహాలు ఇతర ప్రైవేట్ కార్యక్రమాలకు సీఎం హాజరవుతున్నప్పుడు కూడా ట్రాఫిక్ స్తంభిస్తోందని అయితే కోర్టుకు రావటానికి ఉన్న అభ్యంతరం ఎందుకని కోడికత్తి కేసు న్యాయవాది సలీం ప్రశ్నించారు. కోర్టు ముందు జగన్ హజరుకావాల్సిందేనని ఆయన అన్నారు. జగన్ కు మినహాయింపు ఇచ్చే అవకాశం చట్ట ప్రకారం లేదని చెప్పారు.  న్యాయమూర్తి బదిలీ కారణంగా కేసు విచారణను అప్పట్లో వాయిదా వేశారు.  ఇవాళ విచారణ జరగాల్సి ఉన్నా పలు కారణాలతో తాత్కాలిక న్యాయమూర్తి మే 10కి కేసు వాయిదా వేశారు.