Kodali Nani on TDP : టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం(TDP Formation Day)పై మంత్రి కొడాని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఎన్టీఆర్‌ మరణానికి(NTR Death) చంద్రబాబే(Chandrababu) కారణమని ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్‌(NTR) బొమ్మ పెట్టుకుని మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందన్నారు. ఎన్టీఆర్‌ పేరు చెప్పుకుని ఓట్లు అడిగే హక్కు టీడీపీకి లేదని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్‌ను టీడీపీ నుంచి ఎందుకు బయటకు పంపారో చంద్రబాబు చెప్పాలన్నారు. 


ఎన్టీఆర్ అభిమానులు పగ తీర్చుకుంటారు


టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తెచ్చిన ఒక్క పథకాన్ని కూడా ప్రజలు గుర్తుపెట్టుకోలేదని మంత్రి కొడాలి నాని(Kodali Nani) అన్నారు. ఎన్టీఆర్ శాపం చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి గల్లంతు అయిందన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లే వచ్చాయని మంత్రి కొడాలి నాని గుర్తుచేశారు. 73 ఏళ్ల చంద్రబాబు టీడీపీని పరుగెత్తిస్తాడంట అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ శాపం వల్లే లోకేశ్(Lokesh) మంగళగిరిలో ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీపై ఎన్టీఆర్ అభిమానులు పగ తీర్చుకుంటారన్నారు. చంద్రబాబు వల్లే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు వల్లే ఏపీ సర్వనాశనం అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


టీడీపీది 27 ఏళ్ల సంబరమే : సజ్జల రామకృష్ణారెడ్డి 


 టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) స్పందించారు. ఎన్టీఆర్‌ ఉన్న టీడీపీ వేరు ప్రస్తుత టీడీపీ వేరన్నారు. కుట్రలతో అధికారంలోకి ఎలా రావాలనేది ఇప్పటి టీడీపీ పాలసీ అని సజ్జల ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. టీడీపీ 40 ఏళ్ల సంబరాలు కాదు, 27 ఏళ్ల సంబరమేనని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. మీడియా మేనేజ్‌మెంట్‌ బాగా తెలుసన్నారు. ఎన్టీఆర్‌ ప్రజల మద్దతుతో అధికారంలోకి వస్తే చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంట్‌తో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని ఆరోపించారు. టీడీపీ అవసాన దశలో ఉందన్న సజ్జల రాష్ట్రంలో ఆ పార్టీకి ఛాన్స్ లేదన్నారు. అసెంబ్లీ సజావుగా జరగకుండా అడ్డుకునేందుకు టీడీపీ యత్నించిందన్నారు.