Minister Jogi Ramesh : జగనన్న ఇళ్లు–పవన్‌ బాబుల కన్నీళ్లు అంటూ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకుని పవన్ గుంకలాం వెళ్లారో చెప్పాలన్నారు. అక్కడ ప్రభుత్వం 12 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇళ్లను కట్టించి ఇస్తోందని, అయినా ఏ పనులు జరగడం లేదనటం దారుణమని అన్నారు. పవన్ కు కళ్లు కనిపించడం లేదా అని నిలదీశారు. దీనిని పవన్‌ కల్యాణ్, ఆయన దత్త తండ్రి రాక్షసక్రీడగా అభివర్ణించారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తీవ్రస్థాయిలో దుర్భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.


పవన్ ట్యాగ్‌లైన్‌ మార్చుకోవాలి 


సోషల్ ఆడిట్ పేరుతో జనసేన పెట్టిన ట్యాగ్ లైన్ మార్చుకొని ‘జగనన్న ఇళ్లు–పవన్‌ బాబుల కన్నీళ్లు’ అని పెట్టుకోవాలని మంత్రి జోగి రమేష్ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ కు ఘోర అవమానం జరిగిందని, గుంకలాంలో లబ్ధిదారులంతా వచ్చి ప్రభుత్వంపై నిందలు వేసి, తనకు బాసటగా నిలుస్తారని పవన్‌ కల్యాణ్‌ ఆశించినా భంగపాటు తప్పలేదని మంత్రి అన్నారు. విజయనగరం నుంచి జోరుగా గుంకలాం వరకు వెళ్లిన పవన్, అక్కడ ప్రజల స్పందన చూసి నోరెళ్ల బెట్టారని వ్యాఖ్యానించారు. తమకు ఇళ్లు కట్టిస్తున్నారని, బిల్లులు కూడా ఇస్తున్నారని అంతా చెప్పడంతో పవన్‌ గుండె జారి పోయిందని మంత్రి జోగి తెలిపారు. పవన్‌ వెంట లబ్ధిదారులు ఎవ్వరూ లేరని, గుంకలాం వెళ్లిన పవన్, నువ్వు అక్కడ ఏం చేశావు? ఏం చూశావో చెప్పాలన్నారు. ప్రభుత్వం మీద బురద వేయడం కోసం ఒక వెహికిల్‌ ఎక్కి, తిట్టి వెళ్లిపోయిన పవన్  వీకెండ్‌లో గెస్ట్‌ ఆర్టిస్ట్‌గా వచ్చి వెళ్ళారని అన్నారు.


పవన్ కు కళ్లున్నాయా? 


దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, ఆ పనులు శర వేగంగా జరుగుతున్నాయని, అంత మంచిగా పనులు జరుగుతుంటే, ఎందుకంత కడుపు మంటని ప్రశ్నించారు. గుంకలాంలో 10 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే, ఏ పనులూ జరగడం లేదని పవన్ అనటం, ఆయనకు కళ్లున్నాయా అనే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. పనులు ఏమీ జరగనట్లు గెస్ట్‌ ఆర్టిస్ట్‌ కలరింగ్‌ ఇస్తున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వంలో ఉన్నాయని, ఆనాడు మీరిచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారో తెలుసుకోవాలని అన్నారు. అర్హులైన పేదలందరికీ మూడు సెంట్లలో ఉచితంగా పక్కా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారని, మీ ఉమ్మడి ప్రభుత్వంలో కనీసం ఒక్కటంటే ఒక్క పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చారా అని ప్రశ్నించారు.


ఆ ఇద్దరిదీ రాక్షస క్రీడ 


పవన్‌ కల్యాణ్, ఆయన దత్త తండ్రిది రాక్షస క్రీడని మంత్రి జోగి వ్యాఖ్యానించారు. ఇద్దరూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తీవ్రస్థాయిలో దుర్భాషలు ఆడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు కానీ, పవన్‌ కల్యాణ్‌ కానీ.. ఏ లేఅవుట్‌కు అయినా రండి. అన్నీ చూపిస్తాం అని సవాల్ విసిరారు. అయినా దొడ్డిదారిన వెళ్తూ, లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పీకేస్తాం.. లాగేస్తాం.. అన్న మీ మాటలు.. సినిమాల్లోనే చెల్లుతాయి కానీ, రాజకీయాల్లో కాదన్నారు. 2024 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్, నారా లోకేష్‌తో పాటు, చంద్రబాబు కూడా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.