Pawan Kalyan : విజయవాడలో జనసేన జనవాణి రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ పరంగా అయితే ఎన్నో సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని పవన్ అన్నారు. సీఎం సహాయనిధి, ఆరోగ్యశ్రీకి సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చాయని జనసేన నేతలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నామని పవన్‌ పేర్కొన్నారు. 


అందుకే చిరాకు 


అధికారంలో ఉన్నాయన్న గర్వంతో వైసీపీ నాయకులు ప్రవర్తిస్తుంటారని, అందుకే ఆ పార్టీ నేతలంటే చిరాకు అని పవన్ తెలిపారు. ఓ పార్టీ నాయకుడు కబ్జాలు చేస్తూ, లంచాలు తీసుకుంటే భరించగలమని, కానీ అతడి లక్షణాలు గ్రామస్థాయి నాయకుల వరకు వ్యాపించాయని, ఎక్కడ చూసినా మినీ వైసీపీ అధినేతే ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. విశాఖలో కొండల్ని మింగేస్తున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ ఎంపీటీసీ కబ్జా చేసిన భూమిని తిరిగి బాధితులకు ఇప్పించాలన్నారు. ఆ బాధ్యత మంత్రులు తీసుకోవాలన్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తే ప్రజాగ్రహానికి గురికావాల్సిందే అన్నారు. ప్రజా ఉద్యమం వస్తే వైసీపీ నేతల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారని పవన్‌ హెచ్చరించారు.






వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం 


గత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఆ స్థలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు వాపోరని పవన్ అన్నారు. 20 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లో నుంచి బాధితులను వెళ్లగొట్టారని ఆరోపించారు. పై స్థాయి నాయకులు ఏంచేస్తుంటే దిగువ స్థాయి నేతులు అదే ఫాలో అవుతున్నారని పవన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలే ఎక్కువగా తన దృష్టికి వచ్చాయన్నారు.