Know About Famous Kakinada Khaja: కాకినాడ పేరు చెప్పగానే గుర్తుకువచ్చేది కాజా. శతాబ్ధకాలం దాటినా నేటికీ అంతే ఖ్యాతిని గడించిన కాకినాడ కోటయ్య కాజా గురించి తెలియనివారుండరేమో. దాదాపు 131 ఏళ్ల క్రితం కాకినాడలో ప్రారంభించిన ఈ కాజా తయారీ ఎందరినో ఆహార ప్రియులను ఆకట్టుకుని నేటికీ అదే తీరుగా కాకినాడ కాజా ఆదరణ పొందుతోంది. చాలా మందికి కాకినాడ కాజా అనగానే మడత కాజా అనుకుంటారు. కానీ కాకినాడ ప్రత్యేకం ఏంటంటే గొట్టంలా ఉండి మధ్యలో తీయని జ్యూస్(పాకం)తో నిండి ఉండే కాజా. నిత్యం తీపి పదార్ధాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ కాకినాడ గొట్టం కాజా మెనూ ముందు వరుసలో ఉంటుంది.
కాకినాడ వెళ్తే కాజానే..
కాకినాడ ఎప్పుడైనా వెళ్లినా.. లేదా ఎవరైనా తెలిసిన వారు వెళ్లినా ముందుగా కాకినాడ కాజా తేవోయ్.. అంటూ నిర్మొహమాటంగా అడిగేయడం పరిపాటి. అందుకే ఇప్పుడు కాకినాడ కాజా ఖ్యాతి ఖండాంతరాలు దాటిందనే చెప్పవచ్చు. 1981లో ప్రారంభమైన తమ ప్రస్ధానం నేటికీ అంతే ఉత్సాహంతో కొనసాగుతోందని ఈ స్వీట్ తయారీ దారుడైన కోటయ్య అయిదో తరం వారసులు చెబుతున్నారు. కాకినాడలో మెయిన్ రోడ్డు మార్గంలో సంస్థ ప్రదాన దుకాణం ఉండగా నాగమల్లి జంక్షన్ వద్ద మరో బ్రాంచి ఉంది.
గొట్టం కాజా భలే ఫేమస్..
అసలు కాకినాడ కాజాకు కోటయ్య పేరుకు ఏమిటి సంబంధం అని ఓసారి పరిశీలిస్తే చరిత్రలోకి వెళ్లాల్సిందే. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని చిన్నపరిమి గ్రామానికి చెందిన చిట్టిపెద్ది కోటయ్య కాకినాడ వచ్చి స్థిరపడిన క్రమంలో గొట్టం కాజా తయారీ చేశారు. ఆనాటి నుంచి కాకినాడలో కాకినాడ కోటయ్య కాజా పేరుతో ప్రారంభించిన వ్యాపారం నేటికీ అంతే స్థాయిలో కొనసాగుతోంది. ప్రస్తుతం కోటయ్య అయిదో తరం వారుసుడైన చిట్టిపెద్ది రామ్ కుమార్ ఈవ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలే కాకినాడ కాజాకు అరుదైన గౌరవం దక్కింది. పోస్టల్ శాఖ కాకినాడ కాజా పేరుతో ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసిందంటే దాని పేరు, ప్రత్యేకత గురించి పరిచయం అనవసరం.
మైదాపిండి మిశ్రమంతో గొట్టంలా తాయారు చేసే ఈకాజా పూర్తిగా నేతిలో దోరగా వేయించి ఆపై ముందుగా తయారు చేసుకున్న పాకంలో కొన్ని నిముషాల వ్యవధి మునిగేలా ఉంచి బయటకు తీస్తారు. గొట్టం కాజా నిండా పాకం(జ్యూస్) నిండి ఉండిపోవడంతో దీని రుచి పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. కాకినాడలోనే తయారీ కేంద్రాలున్న కాకినాడ కోటయ్య కాజా కోసం నిత్యం పదుల సంఖ్యలో చేయి తిరిగిన వంగాళ్లు వేలాది కాజాలను తయారీ చేస్తూనే ఉంటారు. అంతేస్థాయిలో కూడా కాజాలు అమ్మకాలు జరుగుతుంటాయి. మరింకెందుకు ఆలస్యం కాకినాడ వెళ్తే మీరూ ఓసారి లుక్కేయండి.