Vijayawada Traffic Diversion : దసరా ఉత్సవాలకు బెజ‌వాడ దుర్గమ్మ సన్నిధి సిద్ధమైంది. దీంతో బెజ‌వాడ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ నెల‌ 26వ తేదీ నుంచి ఉత్సవాలు ముగిసే అక్టోబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు విజ‌య‌వాడ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవ‌ర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. భ‌క్తుల‌కు, విజయవాడ మీదుగా ప్రయాణించే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల‌ రాకపోకల మళ్లింపుతో పాటు నగరంలో పార్కింగ్ ప్రదేశాల వివ‌రాల‌ను పోలీసులు శనివారం ప్రకటించారు.  ఈ విష‌యాల‌ను భ‌క్తులు, ప్రయాణికులు, వాహ‌న‌దారులు గమనించాలని కోరారు.  పోలీసుల‌కు స‌హ‌క‌రించి ఉత్సవాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని విజయవాడ క‌మిష‌న‌ర్ క్రాంతి రాణా టాటా కోరారు.  


ట్రాఫిక్ మళ్లింపు  


దసరా ఉత్సవాల కారణంగా సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి నుంచి అక్టోబర్ 05 రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే భారీ, మధ్యతరహా రవాణా వాహనాలను  ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి.కొండూరు-మైలవరం-నూజివీడు- హనుమాన్ జంక్షన్ వైపునకు మళ్లించారు.  విశాఖపట్నం నుంచి చెన్నై,  చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే భారీ, మధ్యతరహా వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ -పామర్రు -అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల-త్రోవగుంట–ఒంగోలు జిల్లా మీదుగా మళ్లించారు. గుంటూరు నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి గుంటూరు వైపు వెళ్లే భారీ, మధ్యతరహా రవాణా వాహనాలను రాకపోకలను మళ్లించారు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు వద్ద, తెనాలి, వేమూరు. కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు - గుడివాడ , హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి చెన్నై వైపు వెళ్లే భారీ, మధ్యతరహా రవాణా వాహనాలను  మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ళ, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లవలెను.  


ఆర్టీసీ, సిటీ బస్సుల రాకపోకలు 


విజయవాడ నుంచి హైదరాబాద్, జగ్గయ్య పేట, తిరువూరు వెళ్ళే ఆర్.టి.సి బస్సుల రాకపోకలు యథావిధిగా అనుమతిస్తారు. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ - కనక దుర్గా ఫ్లైఓవర్ - స్వాతి జంక్షన్ -గొల్లపూడి వై జంక్షన్ - ఇబ్రహీంపట్నం మీదుగా ఆర్టీసీ వాహనాలను అనుమతిస్తారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే ఆర్.టి.సి బస్సులు ఇదే మార్గంలో అనుమతిస్తారు. విజయవాడ సిటీ బస్ స్టాప్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే ఆర్.టి.సి సిటీ బస్సులు  పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ – కనక దుర్గా ఫ్లైఓవర్ - స్వాతి జంక్షన్ - గొల్లపూడి వై జంక్షన్ – ఇబ్రహీంపట్నం వైపు మళ్లించారు.  కనక దుర్గా ఫ్లైఓవర్ కింద ఘాట్ రోడ్డులో అనుమతించరు.  విజయవాడ సిటీ బస్ స్టాప్ నుంచి విద్యాధరపురం,, పాల ప్రాజెక్ట్ మధ్య ఆర్.టి.సి బస్సుల రాకపోకల మళ్లించారు. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ - పి.సి.ఆర్ - గెద్దబొమ్మ- కాళేశ్వరరావు మార్కెట్ పంజా సెంటర్ వి.జి.చౌక్ - చిట్టినగర్ మీదుగా మళ్లించారు.  


మూలా నక్షత్రం రోజున 


మూలానక్షత్రం రోజున అనగా అక్టోబర్ 1 రాత్రి నుంచి 02వ తేదీ రాత్రి వరకు ఆర్.టి.సి/సిటీ బస్సులు ఇబ్రహీంపట్నం వైపునకు (కనక దుర్గా ఫ్లైఓవర్ మీదుగా) కాళేశ్వరరావు మార్కెట్ వైపు అనుమతించరు. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ - పి.సి.ఆర్ - చల్లపల్లి బంగ్లా - ఏలూరు లాకులు - బుడమేరు వంతెన - పైపుల రోడ్ - వై.వి. రావు ఎస్టేట్ - సి.వి.ఆర్. ఫ్లై ఓవర్ - సితార - గొల్లపూడి వై జంక్షన్- ఇబ్రహీంపట్నం మీదుగా ఆర్టీసీ, సిటీ బస్సులు మళ్లించారు.  మూలా నక్షత్రం రోజున అక్టోబర్ 1వ తేదీ రాత్రి నుంచి  2వ తేదీ ఉదయం వరకు ప్రకాశం బ్యారేజి మీద ఎటువంటి వాహనాలు అనుమతించరు.  సెప్టెంబర్ 25 రాత్రి నుంచి అక్టోబర్ 5 రాత్రి వరకు సిటీలో తిరిగే వాహనదారులు  కనక దుర్గా ఫ్లైఓవర్ మీద నుంచి లేదా చిట్టినగర్ టన్నల్ నుంచి గాని భవానిపురం వైపు వెళ్లాల్సి ఉంటుంది. కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్, ఘాట్ రోడ్ నుంచి కుమ్మరిపాలెం వైపునకు ఎలాంటి వాహనాలను అనుమతించరు. 


పార్కింగ్ ప్రదేశాలు ఇవే 


కనకదుర్గమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల వాహనాలు ఈ పార్కింగ్ ప్రదేశాల్లో నిలుపుకోవచ్చు.  


1.పద్మావతి ఘాట్ పార్కింగ్
2. రాజీవ్ గాంధీ పార్క్ పక్క రోడ్డు
3.ఇరిగేషన్ పార్కింగ్
4. కె.ఆర్. మార్కెట్ సెల్లార్ పార్కింగ్
5. బొమ్మ పార్కింగ్
6.గాంధీజి మున్సిపల్ హై స్కూల్ పార్కింగ్ కుమ్మరిపాలెం
7. టి.టి.డి పార్కింగ్ ప్లేస్
8.లోటస్ అపార్ట్మెంట్ పార్కింగ్,
9. పున్నమి ఘాట్ పార్కింగ్
10. భవాని ఘాట్ పార్కింగ్
11. సుబ్బారాయుడు ఖాళీ స్థలం పాత సోమకంపిని వారి స్థలం,  
 12. సితార సెంటర్ వద్ద,
 
భక్తులతో వచ్చే టూరిస్ట్ బస్సుల మార్గాలు 


హైదరాబాద్ వైపు నుంచి వచ్చు భక్తుల బస్సులు - గొల్లపూడి వై జంక్షన్ నుండి స్వాతి జంక్షన్ వద్ద కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్ / భవానీ ఘాట్ లో పార్కింగ్ చేసుకోవాలి.  విశాఖపట్నం వైపు నుంచి వచ్చే భక్తుల బస్సులు- రామవరప్పాడు రింగ్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్ -వైపుల రోడ్ - వై.వి.రావు ఎస్టేట్ - సి.వి.ఆర్ ఫ్లై ఓవర్ - సితార జంక్షన్ - ఆర్.టి.సి వర్క్ షాప్ వద్ద సోమా కంపెనీ మైదానంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. గుంటూరు వైపు నుంచి వచ్చే భక్తుల బస్సులు - కనక దుర్గా వారధి - ఆర్.టి.సి ఇన్ గేట్ – కనకదుర్గా - ఫ్లై ఓవర్ -స్వాతి జంక్షన్ – భవానిపురం దర్గా ఎదురుగా ఉన్న సుబ్బారాయుడి స్థలంలో పార్కింగ్ చేసుకోవాలి.  విజయవాడ నగరం నుంచి వచ్చే భక్తులు తమ కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమె పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు.  భక్తులు తిరిగి వెళ్లే సమయంలో పార్కింగ్ ప్రదేశాల్లో బస్సులు ఎక్కాలన్నారు. వారు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లాలని పోలీసులు సూచించారు.