Sitaram Yechury :  స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయ్యింది కానీ అన్ని రంగాల్లోనూ ఇలాంటి సంక్షోభం ఎన్నడూ చూడలేదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఏ రాజ్యాంగం ఆధారంగా మోదీ ప్రధాని అయ్యారో  ఆ రాజ్యాంగాన్నే ధ్వంసం చేయడానికి బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుందని తీవ్ర స్థాయిలో  విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. విజయవాడ నగరంలోని జింఖానా గ్రౌండ్ లో సీపీఎం దేశ రక్షణ భేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు సీపీఎం కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. దేశ రక్షణ భేరి సభలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు  ఆకట్టుకున్నాయి. ఈ సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు రాజ్యసభ  మాజీ సభ్యులు మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పలువురు సీపీఎం నేతలు హాజరయ్యారు.


42 శాతం నిరుద్యోగం 


ఈ సందర్భంగా సీతారాం ఏచూరి  మాట్లాడుతూ  గత 7 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతులనే మోదీ ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. 20 నుంచి 25 ఏళ్ల యువతలో 42 శాతం మందిని నిరుద్యోగం వేధిస్తోందన్నారు. కోట్ల సంఖ్యల్లో యువతకు ఉద్యోగాల్లేవని అన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆ ఖాళీలను భర్తీ చేసే పని ప్రభుత్వం చేయడం లేదని ఆరోపించారు. గ్యాస్‌ ధరలతోపాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి బతుకు తెరువు ఛిద్రమయ్యే రీతిలో మోదీ విధానాలు పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు.






ఆర్థిక సంక్షోభం 


ఆర్థిక సంక్షోభంతో చిన్న చిన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయని సీతారాం ఏచూరి అన్నారు. కోవిడ్‌ తరువాత మూతపడ్డ ఆ ఫ్యాక్టరీలన్నీ తిరిగి తెరిచే పరిస్థితి కూడా లేదన్నారు. పేదరికం, నిరుద్యోగం, ధరలు పెరుగుతున్నాయని వీటన్నింటికీ పరిష్కారం చేసి ప్రజల బతుకు తెరువును మెరుగుచేసుకోవడానికి ఏదైనా ప్రత్యామ్నాయ దారి ఉందా అని మోదీ అడుగుతున్నారని, వారిముందే ప్రత్యామ్నాయ దారులున్నాయని ఏచూరి అన్నారు.  


ఏడేళ్లలో రెండో స్థానానికి అదానీ


దేశంలో కార్పొరేట్లకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తుందని సీతారాం ఏచూరి ఆరోపించారు. మోదీ ప్రభుత్వం పేదల నడ్డి  విరుస్తోందన్నారు.  రూ. 15 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దేశంలో అందరికీ ఉపాధి కల్పించవచ్చని ఏచూరి తెలిపారు.  దేశంలో 20-25 ఏళ్ల యువకుల్లో 42 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. దేశంలో దాదాపు 10 లక్షల కంటే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రపంచ కుబేరుల్లో ఒక్కడిగా ఉన్న గౌతమ్‌ అదానీ ఒకప్పుడు 330వ స్థానంలో ఉండేవారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలోనే అదానీ రెండో స్థానానికి చేరారని ఏచూరి విమర్శలు చేశారు.  దేశానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నారన్నారు. ఏపీకి  ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రానికి సీఎం జగన్‌ అండగా ఉంటున్నారని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు.  విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తుంటే చోద్యం చూస్తున్నారని విమర్శించారు.