Jagananna Vidya Deevena : సీఎం జగన్ రేపు(ఆదివారం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు. రేపు తిరువూరులో జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆదివారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తిరువూరు చేరుకుంటారు. 11.00 – 12.30 గంటలకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొని జగనన్న విద్యా దీవెన పథకం నిధులు విడుదల చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 1.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
తిరువూరులో సభ
ఈ నెల 19న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో సీఎం జగన్ బటన్ నొక్కి విద్యా దీవెన నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేస్తారని తెలిపింది. తిరువూరులో ఈ నెల 18న సీఎం జగన్ సభ జరగాల్సి ఉంది. అయితే ఈ సభ పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షలు జరుగుతుండడంతో ఈ కార్యక్రమం 19వ తేదీకి వాయిదా పడింది. ఈ కళాశాలలో శనివారం ఇంటర్ విద్యార్థులు ఇంగ్లిష్ పరీక్ష రాయనున్నారు. సభ నిర్వహిస్తే విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో సీఎం జగన్ తన సభను వాయిదా వేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి.
మూడు నెలలకు ఒకసారి నగదు జమ
జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హులైన పేద విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ అందిస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందిస్తున్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు ప్రభుత్వం అందజేస్తుంది. కాలేజీలకు కట్టాల్సిన ఫీజులను మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజులను మూడు నెలలు ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారికి నిధులు అందిస్తుంది. జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా రెండు వాయిదాల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ ఇతర కోర్సులు చేసేవారికి రూ.20 వేలు అందిస్తు్న్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం.
11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్లు జమ
జగనన్న విద్యాదీవెన పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్ రేపు తిరువూరులో విడుదల చేయనున్నారు. 11 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.700 కోట్ల నగదును జమచేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడనున్నారు. సీఎం జగన్ తిరువూరు పర్యటనపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జగన్ సీఎం అయిన తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవం తెచ్చారన్నారు. ప్రతీ ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన పథకాన్ని చేరువ చేశామన్నారు.