BRS Flex In AP : టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాజకీయ ఎత్తుగడలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొత్తుల ప్రస్తావన కూడా తెచ్చారు. బీఆర్ఎస్ ముందుగా కర్ణాటక ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ కు తమ మద్దతు అంటూ కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కేవలం బయట నుంచి మద్దతుగా ఉంటారా? లేక బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దించుతారా? అని విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మరో తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం కాస్త ఆచీతూచీ అడుగులు వేసే ధోరణిలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రకటనకు ముందు ఏపీకి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో కేసీఆర్ చర్చలు జరిపారు. అప్పట్లో ఉండవల్లి ఏపీ బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా విజయవాడలో కొందరు బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. దీంతో ఏపీలోనూ కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ నడపనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 






విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు 


విజయవాడ బీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో కేసీఆర్ తన  మార్క్‌ పాలిటిక్స్ చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. విజయవాడలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో దేశ రాజకీయాలలో నూతన శకం ఆరంభమైందని, కక్ష రాజకీయాలకు స్వస్తి పలకాలని అది భారత రాష్ట్ర సమితితోనే సాధ్యం, బీఆర్‌ఎస్ పార్టీని ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారు, దేశ ప్రగతికి కేసీఆర్‌తో కలిసి ముందుకు నడవాలని అందులో రాశారు. త్వరలో పలువురు ఏపీ నేతలు బీఆర్ఎస్ లో చేరే అవకాశం కూడా లేకపోలేదు. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు మళ్లీ సమైక్య రాష్ట్రం అంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ వచ్చే అవకాశాలను ముందుగా ఊహించి కేసీఆర్ కు కౌంటర్ గా సజ్జల ఇలా వ్యాఖ్యలు చేశారని కొందరు విశ్లేషకులు అంటున్నారు.  



విజయవాడలో ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం! 


విజయవాడలో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవేపై 800 గజాల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. ఈ నెల 18, 19 తేదీల్లో స్థలాన్ని పరిశీలించేందుకు తెలంగాణ మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్ విజయవాడకు రానున్నారు. జనవరిలో రాష్ట్ర, జిల్లాల కమిటీలు వేసే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యాలయం శంకుస్థానపకు సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


కర్ణాటకలో తొలి అడుగు 


వచ్చే ఏప్రిల్ లోపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కూడా  పోటీ చేస్తోంది. జేడీఎస్ బీఆర్ఎస్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. నిన్న తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమానికి జేడీఎస్ నేత కుమారస్వామి హాజరయ్యారు. బీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ కర్ణాటక అని.. అక్కడ కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతు ఇస్తామన్నారు కేసీఆర్. అయితే మద్దతు ఇస్తారా.. కొన్ని సీట్లలో పోటీ చేస్తారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. 


బీఆర్ఎస్ నినాదం కూడా రెడీ


భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయాణం షురూ చేశారు.  తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానం అధికారికంగా ముగిసిపోయింది. ఇక నుంచి కేసీఆర్ జాతీయ స్థాయి ఆలోచనలతో రాజకీయాలు చేయనున్నారు. ఎర్రకోటలపై బీఆర్ఎస్ జెండాలను ఎగురవేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. ఇందు కోసం ఆయన ఎలాంటి కార్యచరణ సిద్ధం చేసుకోబోబోతున్నారు? పార్టీ కార్యవర్గాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు? ఏ స్థాయిలో బీజేపీపై యుద్ధం చేయబోతున్నారు? అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. అయితే రాబోయేది రైతు ప్రభుత్వమే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  స్పష్టం చేశారు. త్వర‌లోనే పార్టీ పాల‌సీలు రూపొందిస్తామ‌న్నారు. రైతుపాల‌సీ, జ‌ల‌ విధానం రూపొందిస్తామని పేర్కొన్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ త‌ర‌ఫున ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. కుమార‌స్వామి క‌ర్ణాట‌క సీఎం కావాల‌ని కేసీఆర్ ఆకాంక్షించారు. నాలుగైదు నెల‌ల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని పేర్కొన్నారు. ఢిల్లీలో భారీ బహిరంగసభ పెట్టి బీఆర్ఎస్ విధాన ప్రకటన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.