Somu Veerraju On CM Jagan : శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ రాజాధానిపై స్పందించిన తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీ సాక్షిగా మడం తిప్పారని ఆక్షేపించారు. అమరావతి రాజధానికి ఏపీ బీజేపీ కట్టుబడి ఉందన్నారు. పార్లమెంట్, న్యాయస్థానాల వంటి పదాలు అసెంబ్లీలో వినియోగించి వికేంద్రీకరణ పాఠ పాడడం దారుణమన్నారు. కర్నూలులో హైకోర్టు బీజేపీ కోరుకుంది కానీ రాజధాని కాదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసి చూపించారన్నారు. అమరావతి రాజధాని కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల అభివృద్ధి పనులు చేసిందన్నారు. ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలని సోము వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం బ్లాక్ పేపర్ విడుదల చేయగలదని సోమువీర్రాజు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
"అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ తీర్మానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అమరావతికే బీజేపీ కట్టుబడి ఉంది. 151 స్థానాలు ఇచ్చారని సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై ప్రజలు మరోసారి ఆలోచించాలి. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్తూ జగన్ కేంద్రం, చట్టసభలను అడ్డుపెట్టుకుంటున్నారు. అమరావతిలో రాజధానిని నిర్మాణం చేయాలని మరోసారి బీజేపీ స్పష్టంగా చెబుతుంది. నైతిక విలువలకు స్థానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారు. బీజేపీ ఎప్పుడు కర్నూలులో రాజధాని ఉండాలని చెప్పలేదు. కర్నూలులో హైకోర్టు ఉండాలని కోరుతున్నాం." అని సోము వీర్రాజు అన్నారు.
సీఎం జగన్ ఏమన్నారంటే
మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానం అని సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ అంశంపై మాట్లాడిన సీఎంజగన్ న్యాయవ్యవస్థపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. మూడు స్థంబాలు ఒకరి పరిధిలోకి ఇంకొకరు రానప్పుడే వ్యవస్థలు నడుస్తాయని అంతా వివరించారని తెలిపారు. ఇవాళ ఎందుకు ఈ డిబేట్ జరుగుతోందంటే.. కోర్టులు శాసనసభను డైరెక్ట్ చేయకూడదన్నారు. రాబోయే రోజుల్లో చట్టం రాబోతుందని వాళ్లంతటే వాళ్లే ఊహించుకొని చెప్పడం సరికాదన్నారు. మూడు రాజధానులపై చట్టమే లేదు. కానీ ఈ తీర్పు ఎందుకు వచ్చిందో తెలియదన్నారు. మెరుగైన చట్టం తీసుకొస్తామని ముందుగానే ఊహించి కోర్టులు తీర్పులు ఇవ్వకూడదని జగన్ అన్నారు. చట్టం చేసే అధికారం శాసనసభకే ఉందని గుర్తు చేశారు. ఇది వేరే వ్యవస్థల పని కాదు. ప్రజలకు మంచి చట్టాలు తీసుకొస్తే అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. లేకుంటే మారిపోతారు. గత ప్రభుత్వ పాలసీలు నచ్చలేదు కాబట్టే 151 స్థానాలు ఇచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారని జగన్ తెలిపారు. ఆ పాలసీని వ్యతిరేకించారు అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు.