Somu Veerraju Counter To Chandrababu : రాష్ట్రం కోసం త్యాగాల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని చంద్రబాబు(Chandrababu) చేసిన వ్యాఖ్యల‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు(Somu Veerraju) స్పందించారు. చంద్రబాబు త్యాగాలు రాష్ట్రానికి అవ‌స‌రం లేదన్నారు. కుటుంబ‌, అవినీతి పార్టీల కోసం త్యాగాలు చేయాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. 2024లో రాష్ట్రంలో అధికారం చేప‌ట్టడ‌మే ల‌క్ష్యంగా పని చేస్తున్నట్లు సోము వీర్రాజు వివ‌రించారు. జూన్ మొద‌టి వారంలో విజ‌య‌వాడ‌, రాజ‌మండ్రిలలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌ల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా(JP Nadda) పాల్గొంటార‌ని చెప్పారు.  


చంద్రబాబుకు కౌంటర్ 


పొత్తులను(Alliance) ఉద్దేశించి చంద్రబాబు ఇటీవల తెలుగు తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. కొంత మంది త్యాగానికి సిద్ధమని మాట్లాడుతున్నారని ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఆ త్యాగం ఏమిటో గమనించామన్నారు. కుటుంబ పార్టీల కోసం బీజేపీ(Bjp) త్యాగం చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. అవినీతి రాజకీయాలు, కుటుంబ పార్టీలకు తాము వ్యతిరేకమని సోము వీర్రాజు తెలిపారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అవినీతి రాజకీయాలకు తాము దూరమన్నారు. త్యాగధనులు తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. బీజేపీ పొత్తు జనసేన(Janasena) పార్టీతోనేనని స్పష్టం చేశారు. ఇప్పటికే జనసేనకు రోడ్ మ్యాప్ ఇచ్చామని పేర్కొన్నారు. టీడీపీ(TDP)తో పొత్తు ఉండదని ఆయన పరోక్షంగా తేల్చిచెప్పారు.


చంద్రబాబు ఏమన్నారంటే? 


ఇటీవల అన్నవరంలో పర్యటించిన చంద్రబాబు  టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసిరావాలన్నారు. ఈ ఉద్యమానికి టీడీపీ న్యాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే తెలుగు తమ్ముళ్లు త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వంపై పోరాటానికి అందరూ కలిసి రావాలని ప్రజా ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే త్యాగాలకూ సిద్ధమని ప్రకటన చేశారు. ప్రజల కోసం తీవ్రవాదులతో పోరాడుతున్నామని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వంపై ఇతర తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ అందరూ కలిసి రావాలని త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు చేసిన కామెంట్లే ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా పార్టీ ఆవిర్భావ సభ నుంచి ప్రభుత్వంపై పోరాటానికి అందరూ కలవాలన్నారు. ఓట్లు చీలనీయబోమని ప్రకటించారు. ఆ సమయంలోనే రాజకీయ త్యాగాలు కూడా చేయాలన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా స్పందించినట్లుగా భావిస్తున్నారు.