Vijayawada News : విజయవాడలో చెత్త సమస్య అజిత్ సింగ్ నగర్ వాసులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గతంలో విజయవాడలో సేకరించిన చెత్తను డంపింగ్ చేసేందుకు అజిత్ సింగ్ నగర్ వాంబ్వే కాలనీ వద్ద స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడే ఎక్సల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి చెత్త నుంచి విద్యుత్ ను వెలికి తీసేందుకు శ్రీరామ్ ఎనర్జీ ప్లాంట్ ను కూడా నెలకొల్పారు. అయితే ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. కాలక్రమంలో చెత్త డంపింగ్ యార్డ్ చుట్టూ ఇళ్ల నిర్మాణాలు పెరిగిపోయాయి. దీంతో ఇళ్ల మధ్యనే డంపింగ్ యార్డ్ ను తొలగించాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. చెత్త డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన రావటంతో పాటు వర్షాకాలంలో అయితే పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు. దోమలు, విషపురుగులు ఇళ్లలోకి చొరబడుతున్నాయని, దీంతో ప్రజలు విష జ్వరాల బారినపడి ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని స్థానికులు అంటున్నారు.
స్థలం దొరకని పరిస్థితి
గర్భిణీ మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని అంటున్నారు. దీంతో డంపింగ్ యార్డ్ ను తరలించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. గతంలో అనేకసార్లు ఆందోళన చేసినప్పటికీ నగర పాలక సంస్థ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. నగర పాలక సంస్థ అధికారులు చెత్త డంపింగ్ యార్డ్ కోసం స్థలాన్ని వెతికేందుకు ప్రయత్నించినా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడా కూడా చెత్త డంపింగ్ కు స్థలం దొరకని పరిస్థితి. ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి, డంపింగ్ యార్డ్ నిర్వహించాలని భావించినప్పటికీ నివాసాలకే స్థలాలు లేకపోగా ఇక డంపింగ్ యార్డ్ కు స్థలం ఎక్కడ దొరుకుంతుందనే పరిస్థితి ఏర్పడింది. విజయవాడ నగరానికి చుట్టు పక్కల గ్రామాల్లో అయినా ప్రభుత్వ స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నించారు. పాతపాడులో పంచాయతీ స్థలాన్ని తీసుకొని అక్కడకు నగరంలోని చెత్తను తరలించేందుకు ప్రయత్నించిన నగర పాలక సంస్థ అధికారులకు స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.
ప్రతిపక్షాల ఆందోళన
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో చెత్తను తీసుకువచ్చి తమ గ్రామంలో వేస్తారా అంటూ పాతపాడుకు చెందిన స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కూడా చెత్త డంపింగ్ కు వీలులేకుండాపోయింది. ఈ నేపథ్యంలో అజిత్ సింగ్ నగర్ లోని చెత్త డంపింగ్ యార్డ్ తరలింపు సమస్య నగరపాలక సంస్థ అధికారులకు సవాల్ గా మారింది. పాలకులు మారినప్పుడల్లా ప్రతిపక్షాలు ఆందోళన చేయటం పరిపాటిగా మారింది. తాజాగా సీపీఐ నాయకులు చెత్త డంపింగ్ యార్డ్ లోని చెత్తను ఎట్టి పరిస్థితుల్లో తరలించాల్సిందేనని డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళనకు దిగారు. పాలకులు స్పందించటం లేదని, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటి ముందే చెత్త వేసి నిరసన తెలుపుతామంటూ ఆందోళనకు దిగిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ కార్యాలయం నుంచి ఆందోళనకు బయలుదేరిన పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఆందోళనను భగ్నం చేశారు. దీంతో చెత్త తరలింపుపై ఆందోళన మరోసారి వాయిదా పడింది.