VijaySai Reddy BC : బీసీ సామాజికవర్గాలకు చెందిన వారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అడగాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీలోని వివిధ బీసీ వర్గాలకు చెందిన నేతలతో ఆయన తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. ఎస్సి ఎస్టీ లకు రిజర్వేషన్లను రాజ్యాంగం ఇచ్చిందన్నారు. జనాభా ప్రాతిపదికన బిసి లు రిజర్వేషన్లు అడగాలని.. కొన్ని వర్గాలను ఎస్సి ఎస్టీ లో కలపాలని కోరితే సాధ్యం కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు ఉండాలన్నారు.
సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ముఖ్యమంత్రితో ఆదేశాలు ఐ ప్యాక్ సహకారంతో బీసీ నేతలతో సమావేశం అయ్యామన్నారు. భవిష్యత్ లో బీసీల సమస్యలు పరిష్కారం పై చర్చ జరిగిందన్నారు. 225 మంది ప్రజా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారని.. తెలిపారు. మరో పది రోజుల్లో స్థానిక బిసి ప్రజా ప్రతినిధులు తో మరో సమావేశం నిర్వహిస్తున్నామని.. 26 జిల్లాలలో కూడా బిసి ల సమస్యల పరిష్కారం కోసం సమావేశాలు ఉంటాయని ప్రకటించారు. ప్రతి పనిలో బిసిల శ్రమ కృషి ఉన్నాయన్నారు. అందుకే వైసీపీ బిసి లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. సీఎం అహర్నిశలు బిసి ల అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. ప్రస్తుత సమవేశంలో 139 బీసీ సామాజిక వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని.... 225 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
స్థానిక ఎన్నికల్లో గతంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవి. కానీ హైకోర్టు తీర్పు కారణంగా గత ఎన్నికల్లో కేవలం 24 శాతం వరకే నిర్ణయించి ఎన్నికలు జరిపారు . దీంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకే రిజర్వేషన్ల అంశంలో బీసీ నేతలతో ప్రస్తుతం సమావేశాలు నిర్వహిస్తున్నారని.. బీసీలు యాభై శాతం మందికిపైగా ఉన్నారని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అడగాలని సూచిస్తున్నారని భావిస్తున్నారు. ఈ అంశంపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించడంతో... ఈ అంశాన్ని రిజర్వేషన్ల ఉద్యమంగా మార్చే ఆలోచనలో ఉన్నారని భావిస్తున్నారు.
కాపు రిజర్వేషన్ల అంశం కూడా ఏపీలో అపరిష్కృతంగా ఉంది. కాపు రిజర్వేషన్లను జగన్ సీఎం అయ్యాక తొలగించారు. కేంద్రం ఈడబ్ల్యూఎస్ కోటా కింద పదిశాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల చట్టపరమైన లాంఛనాలు పూర్తయ్యాయి. సర్టిఫికెట్ల జారీనే మిగిలింది. అయితే జగన్ అధికారంలోకి రాగానే ఆ రిజర్వేషన్లు సాద్యం కావని తొలగించారు. ఇలాంటి డిమాండ్‌ల కారణంగా ప్రస్తుతం విజయసాయిరెడ్డి సమావేశాలు రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.