Actor Raja in Congress :  మాజీ సినీ నటుడు,  క్రైస్తవ ప్రచారకుడు  రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు.  విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బుధవారం పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆయనకు సాదర స్వాగతం పలికారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాజాకు కండువా కప్పిన పీసీసీ అధ్యక్షుడు రాజాను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తాను ముందు నుంచి అభిమానిని అని చెప్పారు. సినిమాలు, ఆ తరువాత ఆధ్యాత్మిక జీవితంతో కొంతకాలం పార్టీకి దూరమయ్యానని చెప్పారు. రాజా లాంటి వ్యక్తుల చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని గిడుగు రుద్రరాజు ఆశాభవం వ్యక్తం చేశారు. అధిష్టానం ఆదేశాలతో పార్టీ బలోపేతానికి వాడుకుంటామని, అదే విధంగా షర్మిల వచ్చినా పార్టీ సేవలకు వినియోగించుకుంటామని పీసీసీ అధ్యక్షులు స్పష్టం చేశారు.                                                                           


మణిపూర్ అల్లర్ల సందర్భంగా దేశంలో ఎవ్వరూ కూడా సాహసించని విధంగా రాహుల్ గాంధీ స్పందించిన తీరు తనను ఎంతో ప్రభావితం చేసిందని, అదే స్పూర్తితో తాను పార్టీలో చేరానని రాజా తెలిపారు. రాహుల్ ఆలోచనా విధానం తనకు ఎంతో నచ్చిందని చెప్పిన ఆయన, సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా తనకు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తానని తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను అందరూ చూస్తున్నారన్న రాజా.., అందరికీ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.                               


జాతీయ స్థాయిలో కూడా పార్టీకి తన సేవలు అందించేందకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విశాఖపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త, జేడీ లక్షీ నారాయణతో వివిధ ఉద్యమాల్లో పాల్గొన్న మురారీ కూడా పీసీసీ అధ్యక్షుని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా జరిగిన మణిపూర్ అల్లర్ల విషయంలో కొందరు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కనీసం నోరు మెదపలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని రాజా విమర్శించారు. అటువంటి సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చింది రాహుల్ గాంధీనే అని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం గురించి విజన్ ఉన్న నాయకుడు రాహుల్ అని ప్రశంసించారు.  .