Cyclone Montha Impact in AP: అమరావతి: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మొంథా తుపానుగా బలపడింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో మొంథా తుపాన్ కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 600 కిలోమీటర్లు,  విశాఖపట్నంకి  710 కి.మీ, కాకినాడకి  680 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. తీరం వెం గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అత్యవసర సహాయ నంబర్లు 112, 1070, 1800 425 0101 ద్వారా సంప్రదించి సహాయం పొందాలని అధికారులు సూచించారు. మొంథా తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ సూచనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.

Continues below advertisement


వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి
ప్రస్తుతానికి వాతావరణం ప్రశాంతంగా ఉందని నిర్లక్ష్యంగా ఉండవద్దని, నిశితంగా వేచి చూడాలని.. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. 






7 జిల్లాలకు కొనసాగుతున్న రెడ్ అలర్ట్
నేడు కాకినాడతో పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్న బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు రెండు రోజులపాటు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది. 






సోమవారం నాడు ఈ జిల్లాల్లోనూ వర్షాలే..


మొంథా తుపాను ప్రభావంతో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి,
తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మొంథా తుపాను సమయంలో జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను సైతం ప్రభుత్వం నియమించింది. సంబంధిత అధికారి జిల్లాలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం రూ.14 కోట్ల నిధులు విడుదల చేసింది.


తుపాను, వర్షాల ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లకు రెండు నుంచి మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరికొన్ని జిల్లాల్లోనూ నేడు విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు.