NACIN: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాలసముద్రంలోని నేషనల్ కస్టమ్స్ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మరిన్ని సంస్థలు, నిధులు కేటాయించాలని కోరారు. ఎపి లోని పాలసముద్రం లో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (NACIN) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ శిక్షణా సంస్థ రాష్ట్రానికి అభివృద్ధి, ఉపాధి కోసం ఉపయోగపడనుంది. కేంద్ర మంత్రి దూరదృష్టి, నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే స్పూర్తిగా నిలవాలని కోరారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) ప్రధాన శిక్షణా కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని పాలసముద్రం లో ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫైనాన్స్ మినిస్ట్రీ కింద కేంద్ర రెవెన్యూ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ద్వారా నిర్వహిస్తున్నారు. NACIN దేశవ్యాప్తంగా అనేక శిక్షణా కేంద్రాలను కలిగి ఉంది, కానీ పాలసముద్రం దాని అత్యాధునిక సౌకర్యాల కారణంగా ప్రధాన కేంద్రంగా తీర్చి దిద్దారు.
NACIN ప్రధానంగా కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ (GST, సెంట్రల్ ఎక్సైజ్), నార్కోటిక్స్ కంట్రోల్ రంగాలలో శిక్షణను అందిస్తుంది. ఇది భారతీయ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారులు, కస్టమ్స్ అధికారులు, ఇతర సంబంధిత సిబ్బందికి వృత్తిపరమైన శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కేంద్రం కస్టమ్స్ చట్టాలు, GST అమలు, డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సరిహద్దు భద్రత వంటి అంశాలలో అధికారులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, స్మగ్లింగ్, ఆర్థిక నేరాలు, మరియు మాదక ద్రవ్యాల నియంత్రణలో నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. NACIN అంతర్జాతీయ సంస్థలతో సహకరిస్తూ, గ్లోబల్ కస్టమ్స్ ప్రమాణాలు , శిక్షణా పద్ధతులను అనుసరిస్తుంది. ఇది వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (WCO) రీజనల్ ట్రైనింగ్ సెంటర్‌గా కూడా పనిచేస్తుంది.
ఇలాంటి ప్రతిష్టాత్మక కేంద్రాన్ని వెనుకబడిన జిల్లా అయిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేటాయించారు. ఈ కేంద్రం ద్వారా అనంతపురం జిల్లాకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.