Avanigadda: కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరుగుతున్న వారాహి యాత్ర సభా ప్రాంగణానికి నిరుద్యోగులు ఆదివారం భారీగా తరలి వచ్చారు. మెగా డీఎస్సీ విడుదల చేయాలనంటూ ‘మెగా డీఎస్సీ ఎక్కడ జగనన్న?’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ను కలిసి తమ బాధలు చెప్పుకొనేందుకు వచ్చామని నిరుద్యోగ యువకులు తెలిపారు. మెగా డీఎస్సీ విడుదల చేసేలా  వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పవన్‌కు విజ్ఞప్తి చేశారు. 


ప్రభుత్వ పాఠశాలల విలీనానికి 117 జీవో తీసుకొచ్చారని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ బడుల విలీనంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యోగాలు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని 2018లోనే జగన్‌ హామీ ఇచ్చారు. జగన్‌ సీఎం అయ్యి నాలుగున్నర ఏళ్లలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 50 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. డీఎస్సీ కోసం లక్షల మంది యువత ఎదురు చూస్తున్నారని తెలిపారు. 


నెలకు రూ.వేలకు వేలు ఫీజులు కట్టి శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు ఏం చేయాలో తెలియడం లేదన్నారు. గతంలో ఇదే మైదానంలో జగన్ ఎన్నికల ప్రచార సమయంలో మెగా డీఎస్సీ విడుదల చేస్తామని చెప్పారని, కానీ నాలుగున్నర ఏళ్లుగా ఒక్క డీఎస్సీ పోస్ట్ పడలేదన్నారు. జీవో 117తో పాఠశాలను విలీనం చేసి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తాను అనకున్న పని మాత్రమే చేస్తున్నరాని విమర్శించారు. ప్రభుత్వం రోజుకో మాట, పూటకో మాట చెబుతోందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని విస్మరించారని అన్నారు. 


అసెంబ్లీ సమావేశాల్లో 8 వేల పోస్టులు ఉన్నట్లు చెప్పారని, కానీ వచ్చే ఆరు నెలల్లో వాటిని భర్తీ చేస్తారనే నమ్మకం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు ముఖాలు చూపించలేకపోతున్నామని వాపోయారు. ఈ ప్రభుత్వంపై నమ్మకం లేదని, డీఎస్సీ అభ్యర్థులను ప్రభుత్వం నిలువునా ముంచేసిందన్నారు. డీఎస్సీ అభ్యర్థుల ఓట్లు 25 లక్షల వరకు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో తామేంటో చూపిస్తామన్నారు. ఇంటికి రేషన్ ఇస్తున్నప్పుడు, ఇంటికి పెన్షన్ ఇస్తున్నప్పుడు సొంత ఊర్లో విద్య ఎందుకు అందించలేరని నిలదీశారు. 


అలా చేయకుండా ఇక్కడ ఉన్న విద్యార్థులను పక్క పాఠశాలల్లో కలిపేయడం, బడులు మూసేయడం సరికాదన్నారు. విద్యార్థులు బడులకు వెళ్లాలంటే బస్సులు లేవన్నారు.  విద్యార్థులు చాలా ప్రాంతాల్లో మూడు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారని చెప్పారు. పాఠశాలు విలీనంతో వసతుల కొరత ఉందని, వరండాల్లో కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్త తరగతి గదులు లేవని, అన్నీ కల్పించన తరువాత కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాన్నారు. వసతులు కల్పించడకుండా  కొత్త విద్యా చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు దానికి తగ్గట్లు సదుపాయాలు కల్పించాలని అన్నారు. 


దేశంలో ఏ రాష్ట్రం కొత్త విద్యా విధానాన్ని అమలు చేయలేదని, ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అమలు చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. గోడలు కట్టి, సున్నాలు వేస్తే విద్యా విధానం మార్చినట్లు కాదన్నారు. సరైన ఉపాధ్యాయులు ఉంటేనే విద్యా వ్యవస్థ బాగుపడుతుందన్నారు. పవన్ దృష్టికి  తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే ఆశతో ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.