Undavalli Sridevi Press Meet: పార్టీ నుంచి తనను తప్పించేందుకు ముందు నుంచి తనపై కుట్ర జరిగిందని, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను బూచీగా చూపి తనపై వేటు వేశారని తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి అన్నారు. తనపై కొంత మంది వైఎస్ఆర్ సీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర ఆరోపణలతో వేధిస్తున్నారని శ్రీదేవి అన్నారు. ఈ వార్తలు కొన్ని మీడియా ఛానెళ్లలో కూడా వచ్చాయని అన్నారు. తానేమైనా గ్యాంగ్ స్టరా అని ప్రశ్నించారు. నిన్నటి నుంచి ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ అంటూ కథనాలు వస్తున్నాయని అన్నారు. తన ఆఫీసుపై వైఎస్ఆర్ సీపీ నేతలు దాడులు చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియాలో భాగంగా అందరూ ముడుపులు పంచుకున్నారని, ఉద్ధండరాయుని పాలెంలో ఇసుక మాఫియా ఎవరిదని ప్రశ్నించారు. తాను లోకల్ దందాలకు సహకరించడంలేదని ఇలా వేటు వేశారని అన్నారు. హైదరాబాద్‌లో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
పిచ్చి కుక్కతో సమానంగా చూశారు - శ్రీదేవి
‘‘నేను ఓటు వేసేటప్పుడు అక్కడేమైనా కెమెరా పెట్టారా? టీడీపీకి ఓటు వేసిన 23 మంది ఎమ్మెల్యేల్లో జనసేన ఎమ్మెల్యే కూడా ఉండి ఉండొచ్చు. నన్ను టార్గెట్ చేసి, తప్పించాలని చూస్తున్నారు. నేను ఓటుకు నోటు తీసుకున్నానని ముద్ర వేశారు. పక్కా పథకంలో భాగంగానే నాపై నిందలు వేశారు. ముందు నుంచి నాపై ప్రీ ప్లాన్డ్‌గా కుట్ర జరిగింది. నన్ను పిచ్చికుక్కతో సమానంగా చూశారు. ఒక డాక్టర్ ని తన్ని రోడ్డుపై పడేశారు.
అమరావతి రైతులకు అండగా ఉంటా
2019లో అమరావతి ఇక్కడే ఉంటుందని నేను అందరికీ చెప్పా. సీఎం జగన్ కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు.. ఆయనెక్కడికీ వెళ్లబోరని అందరికీ చెప్పేదాన్ని. ఇప్పుడు నేను రోడ్డుపై వెళ్తుంటే అందరూ రాజధాని గురించి అడుగుతున్నారు. అమరావతి ఇక్కడే ఉంటుందని అందరికీ సమాధానం చెప్పిన నేను, ఇప్పుడు ఎవరికీ ఏం చెప్పలేకపోతున్నా. వారి ఉద్యమాలతో అంతర్మథనం చెందా. అమరావతి రైతులకు నేను ఒకటే చెబుతున్నా. నేను నాలుగేళ్లు బానిస సంకెళ్లలో ఉన్నా. నా ప్రాణం పోయినా సరే ఇకపై నేను అమరావతి కోసం నిలబడతా’’ అని ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారు. తనకు ఏపీ రావాలంటేనే భయమేస్తోందని అన్నారు. ఏపీలో ఎస్సీలకు రక్షణ లేదని అన్నారు.
సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. సీఎం జగన్ మంచి మనిషి అని, ఆయనకు కేవలం చెవులే ఉంటాయని అన్నారు. పక్కవాళ్ళు చెప్పిందే వింటారని చెప్పారు. ఇంటిలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని గ్యాంబ్లింగ్ అని కొట్టాపారేశారు.
మా బ్యాలెట్ పేపర్ చూపండి, తప్పు చేస్తే ఉరి తీయండి - కమ్మెల శ్రీధర్
ఈ ప్రెస్ మీట్‌లో ఉండవల్లి శ్రీదేవి భర్త డాక్టర్ కమ్మెల శ్రీధర్ మాట్లాడుతూ.. తాము ఎవరికీ అమ్ముడు పోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను కాపు కులస్తుడ్ని అని, అందుకే ఆరోజు తన భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారని గుర్తు చేశారు. కేవలం అపోహతో ట్రోలింగ్ చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర ముందు వేరే వ్యక్తిని ఎందుకు ఇంచార్జిగా వేశారని ప్రశ్నించారు. మొత్తానికి తాము అమరావతిలో తిరగలేని పరిస్థితి తెచ్చారని అన్నారు. ఎవరెన్ని చేసినా జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని అనుకోలేదని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భార్య క్రాస్ ఓటింగ్ చెయ్యలేదని స్పష్టం చేశారు. తమ బ్యాలెట్ పేపర్ చూపించండని, తప్పు చేస్తే ఉరి తీయండని చెప్పారు.