Undavalli On RamojiRao : మార్గదర్శి చిట్స్ వ్యాపారంలో అనేక నిబంధనలను ఉల్లంఘించిందని, ఇప్పుడు అవే అక్రమాలు బయటపడుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలో మార్గదర్శి వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి నిబంధనలను ఉల్లంఘించిందనే విషయాన్ని తాను ఏనాడో చెప్పానని నష్టాల్లో నడుస్తోందని కూడా చెప్పానని దానిపై ఆ సంస్థ ద్వారా తప్పులు బయ టకు తీసినందుకు తనపై రామోజీరావు కేసులు పెట్టించారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ సీఐడీ విచారణలో అందుకు తగ్గట్లే చిట్ అక్రమాలు జరిగినట్లు ఇప్పుడు తేలుతోందన్నారు.
మార్గదర్శిని రామోజీ తన ఇష్టమొచ్చినట్లు నడిపిస్తూ డిపాజిటర్ల సొమ్మును సొంత వ్యాపారాలకు వినియోగిస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. చిట్ ఫండ్ వ్యాపారం చేసేవారు వేరే వ్యాపారాలు చేయకూడదని ఉండవల్లి స్పష్టం చేశారు. బ్రహ్మయ్య అండ్ కంపెనీకి చెందిన సీఏను అరెస్ట్ చేస్తే. అది అందరు సీఏలపై దాడి ఎలా అవుతుందని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఉండవల్లి స్పష్టం చేశారు. రామోజీ అయినా ఇంకెవరైనా చట్టం ముందు అంతా సమానమేనన్నారు. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామికే రూ.10 కోట్లు ఫైన్ వేశారని వెంకటేశ్వరస్వామి కంటే కూడా అతీతుడిననీ రామోజీ అనుకుంటారని కానీ, విజయ్ మాల్యా, రామోజీ రావు ఈ ఇద్దరూ చేసింది ఒక్కటే అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
సెక్షన్ 477 - ఏ ప్రకారం అకౌంట్స్ తారుమారు చేస్తే శిక్ష తప్పదని స్పష్టం చేశారు. రామోజీరావుకు పారదర్శకత ఉంటే.. డిపాజిటర్ల పేర్లు విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే.. రామోజీరావు పత్రికాస్వేచ్ఛపై దాడి అని చెప్పుకుంటారని ఉండవల్లి ఎద్దేవా చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇండివిడ్యువల్ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్ సమర్పించలేదని, బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి అందజేయలేదని అధికారులు తెలిపారు. మూడు నెలలుగా మార్గదర్శికి చెందిన 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను నిలిపివేశారని తెలిపారు. డిసెంబర్ నుంచి ఈ ఫారం నింపి ఇవ్వలేదని సీఐడీ అధికారులు ఆరోపణలు చేస్తున్నారు.
మొత్తం మూడు చట్టాల కింద కేసులు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982 లోని సెక్షన్ 76,79 ప్రకారం ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. రామోజీరావును ఆయన ఇంట్లో సోమవారం సీఐడీ అధికారులు ప్రశ్నించారు.