Union Minister posts for TDP| న్యూఢిల్లీ: ఎన్డీయే 3.0లో కీలకమైన ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ (TDP)ని రెండు కేంద్ర మంత్రి పదవులు వరించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు తొలిసారి ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖర్‌లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ హోదా దక్కగా, పెమ్మసానికి సహాయమంత్రి పదవి ఖరారైనట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత రానుంది. 


బీజేపీ నుంచి పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్‌కు కేంద్ర మంత్రివర్గంలో చాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలోనే ఉన్న జనసేనకు సైతం ఓ మంత్రి పదవి దక్కనుంది. ఎంపీ బాలశౌరికి సహయ మంత్రి పదవి వరించిందని సమాచారం. మరోవైపు వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును నరేంద్ర మోదీ, ఎన్డీయే నేతలు కలిసి ఎంపీల మద్దతు లేఖల్ని సమర్పించారు. ఆదివారం రాత్రి 7:15 నిమిషాలకు భారత ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. నరేంద్ర మోదీతో రాష్ట్రపతి ముర్మ ప్రమాణం చేయించనున్నారు. 


తెలంగాణకు కేంద్ర మంత్రి పదవులు..!
తెలంగాణకు సైతం కేంద్ర కేబినెట్ లో బెర్తులు దక్కనున్నాయి. మోదీ 3.0 సర్కార్ లో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి ఛాన్స్ ఉండనుంది. పార్టీ జాతీయ నేత, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ సైతం రేసులో ఉన్నారు. మహిళా కోటాలో డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మహబూబ్‌నగర్‌ ఎంపీగా డీకే అరుణ విజయం సాధించారని తెలిసిందే. ఈటల రాజేందర్‌కు పార్టీ పదవి దక్కుతుందా లేక ఎన్డీయే కొత్త ప్రభుత్వంలో మంత్రి అవుతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.