Two Sisters Died In Nellore: అక్క మృతిని తట్టుకోలేక చెల్లి కూడా కన్నుమూసిన విషాద ఘటన నెల్లూరులో జరిగింది. మృతదేహం వద్ద ఏడుస్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని పటారుపల్లి చలపతినగర్ కు చెందిన మాజీ జవాన్ మల్లికార్జున, యామిని దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె యమున ఇంటర్ పూర్తై నీట్ కు సిద్ధం అవుతోంది. రెండో కుమార్తె తులసి మానసిక దివ్యాంగురాలు కావడంతో ఇంట్లోనే ఉంటుంది. 4 నెలల క్రితం యమున అనారోగ్యానికి గురై చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. సాయంత్రం ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.


అక్క మృతదేహం వద్ద ఏడుస్తూ..


అయితే, అక్క మృతదేహం వద్ద ఏడుస్తూ చెల్లి తులసి కూడా కన్నుమూసింది. గంటల వ్యవధిలోనే అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మరో నాలుగు రోజుల్లో యమున పుట్టినరోజు ఉండగా.. ఆమె స్నేహితులు కన్నీటితో ఆమె మృతదేహం వద్దే కేక్ కట్ చేశారు. ఎప్పుడూ సరదాగా గడిపే అక్కాచెల్లెళ్లు ఇక లేరనే వార్తను బంధువులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంతో పాటు స్థానికంగానూ తీవ్ర విషాదం నెలకొంది. 


Also Read: AP Election Violence: ఏపీలో అల్లర్ల ఘటనలు - సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం, పోలింగ్ అనంతర హింసపై మరిన్ని కేసులు