Dadisetti On Yanamala : టీడీపీ నేత యనమలపై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. కాకినాడ జిల్లా తుని మండలంలోని తన నివాసంలో మంత్రి దాడిశెట్టి రాజా మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. యనమల రామకృష్ణుడు తన స్వగ్రామంలో కనీసం హైస్కూల్ కూడా కట్టించలేదని విమర్శించారు. యనమలకు జ్ఞానోదయం కలిగిస్తే అప్పుడు హైస్కూల్ కట్టించారని మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రాష్ట్రంలో నారా లోకేశ్ బఫూన్ గా తయారయ్యారన్నారు. టీడీపీలో నెంబర్ టుగా ఉన్న యనమలను దాటి అచ్చెన్నాయుడు సీఎం అవ్వాలని చూస్తున్నారన్నారు. యనమలది ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర అని ఆరోపించారు. చంద్రబాబు ముసలోడు అయ్యాడు కాబట్టి వెన్నుపోటు పొడిచి సీఎం పదవికి ట్రై చెయ్ అని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో వ్యాపారాల పైన, పరిశ్రమల పైన పెట్టుబడులు పెడతారు కానీ జగన్మోహన్ రెడ్డి విద్య వ్యవస్థపై రూ. 60 వేల కోట్లు పెట్టుబడి పెట్టారన్నారు. యనమల తప్పుడు కూతలు కూస్తే ఇంటికి వచ్చి నీ చెయ్యి పట్టుకుని మీ ఊళ్లో ఉన్న స్కూలుకి తీసుకెళ్లి చూపించి చెప్పు తీసి కొడతానని మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యనమల వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు
యనమల రామకృష్ణుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. ఏపీ విద్యా విధానాలను కేంద్రం బడ్జెట్‌లో ప్రస్తావించిందన్నారు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలకు రాష్ట్రానికి గుర్తింపు లభించిందన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. విద్య, వైద్య రంగాలకు అత్యధికంగా ఖర్చు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల్లో కనీసం టాయిలెట్లు కూడా లేవని విమర్శించారు. నాడు-నేడు కింద పాఠశాలల రూపురేఖలు మార్చామని, ఆ విషయాలు తెలుసుకోవాలన్నారు. యనమల స్వగ్రామంలో నాడు-నేడు కింద పనులు జరుగుతున్నాయన్నారు. యనమల ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని మంత్రి దాడిశెట్టి రాజా హితవు పలికారు. యనమల వస్తే నియోజకవర్గంలో పాఠశాలలకు తీసుకెళ్తానన్నారు. హైస్కూల్ కడితే తన పొలాల్లో పనిచేసేందుకు ఎవరు రారని స్వగ్రామంలో హైస్కూల్ కట్టించలేదని యనమలను విమర్శించారు. అలాంటి ఆయన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి రాజా విమర్శించారు.
చెప్పుతో కొడతా
"2014లో మీ ఊరి ప్రజలందరూ హైస్కూల్ కోసం మీ వద్దకు వస్తే... మీరన్న మాటలు గుర్తుందా? హైస్కూల్ గ్రాంట్ చేస్తే మన పొలాల్లో పనిచేయడానికి ఎవరుంటారు అన్నారు. ఈ విషయంపై నేను పోరాటం చేస్తే అప్పుడు హైస్కూల్ గ్రాంట్ చేశారు. అయినా హైస్కూల్ కు బిల్డింగ్ లేదు. కళ్యాణమండపంలో పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాడు-నేడులో భాగంగా హైస్కూల్ భవనాలు కట్టారు. అలాంటి వ్యక్తి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర ఫెయిల్ అయింది. ఇప్పుడు అచ్చెన్నాయుడు నెంబర్ టు ప్లేస్ లోకి వచ్చారు. ఆ ప్లేస్ కోసం ట్రై చేసుకో అంతే కానీ విద్యా వ్యవస్థపై విమర్శలు చేస్తే ఊరుకోం. ఎవరైనా పెట్టుబడులు వ్యాపారాలపై పెడతారు కానీ సీఎం జగన్ పిల్లల భవిష్యత్ పై పెట్టుబడి పెట్టారు. యనమల ఇలాగే మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాను." - మంత్రి దాడిశెట్టి రాజా