Tungabhadra Dam : కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతుంది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతోంది. శనివారం తుంగభద్ర డ్యామ్ కు 98,644 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. అవుట్ ఫ్లో 216 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 73.939 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1624.21 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువన భారీగా కురుస్తున్న వర్షాలకు వరద తీవ్రత పెరిగి టీబీ డ్యామ్ కు ఇన్ ఫ్లో భారీగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నేడో రేపో డ్యాం గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తుంగభద్ర నదీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తుంగభద్ర బోర్డు అధికారులు కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ హెచ్చరికలు జారీ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు విస్తరణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా, కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి జిల్లాల్లో లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పట్టణాల్లోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. పలు జిల్లాల్లో చెరువులు అలుగుపారుతున్నాయి. వరద దాటికి కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. నదుల్లోకి భారీగా వరద నీరు చేరడం జలాశయాలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ధవళేశ్వరం నుంచి సముద్రంలో నీరు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద పెరుగుతోంది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి లక్షా 15 వేల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నీటిమట్టం 9.7 అడుగులు ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో ధవళేశ్వరం వద్దకు వరద పోటెత్తుతోంది. గోదావరికి ఆకస్మిక వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున కోస్తాంధ్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.