TTD Decided To Make Additional Laddus For Devotees: కలియుగ వైకుంఠం తిరుమలలో (Tirumala) శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూసినట్లే లడ్డూల కోసం కూడా క్యూలైన్లలో వేచి చూస్తుంటారు. అయితే, డిమాండ్ దృష్ట్యా టీటీడీ (TTD) భక్తులకు పరిమిత సంఖ్యలోనే లడ్డూలు అందిస్తోంది. దీనిపై భక్తుల్లో కొంత అసంతృప్తి నెలకొనగా.. తితిదే గుడ్ న్యూస్ అందించింది. భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6 వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు ప్రతీ రోజూ తయారు చేస్తున్నారు. కాగా, రద్దీ, డిమాండ్ దృష్ట్యా అదనంగా రోజుకు 50 వేల చిన్న లడ్డూలు, 4 వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారీకి టీటీడీ సిద్ధమవుతోంది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టింది.


తిరుమల వెంకటేశ్వరుని ప్రతి రోజూ 65 వేల నుంచి 70 వేల వరకూ భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు ఆవరణలో ఓ చిన్న లడ్డూని ఉచితంగా ఇస్తారు. అనంతరం అదనంగా లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కరికి 4 లడ్డూలను విక్రయిస్తుంది. దర్శనానికి వెళ్లకుండా లడ్డూలు కొనుగోలు చేయాలనుకునే భక్తులకు ఆధార్ కార్డుపై 2 లడ్డూలను విక్రయిస్తారు. ఈ స్వామి వారి ప్రసాదాలను స్థానిక తిరుపతి ఆలయాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులోని శ్రీవారి ఆలయాల్లో విక్రయిస్తున్నారు. అయితే, వారాంతాల్లో లడ్డూలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో దానికి తగ్గట్లుగానే లడ్డూలను తయారు చేయాలని టీటీడీ భావిస్తోంది.


హుండీ@రూ.100 కోట్ల మార్క్ 


అటు, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రూ.100 కోట్ల మార్క్ దాటింది. నవంబరులో హుండీ ద్వారా రూ.111 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా 11 నెలల కాలంలో శ్రీవారికి రూ.1,253 కోట్ల ఆదాయం లభించిందని చెప్పారు. కాగా, 2022 మార్చి నుంచీ కూడా ప్రతి నెలలోనూ శ్రీవారి హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్ దాటుతూ వస్తోంది. ఈ ఏడాది జనవరిలో రూ.116 కోట్లు, ఫిబ్రవరిలో రూ.112 కోట్లు, మార్చిలో రూ.118 కోట్లు, ఏప్రిల్ రూ.101 కోట్లు, మేలో రూ.108 కోట్లు, జూన్‌లో రూ.114 కోట్లు, జులైలో రూ.125 కోట్లు, ఆగస్టులో రూ.126 కోట్లు, సెప్టెంబరులో రూ.114 కోట్లు, అక్టోబరులో రూ.127 కోట్ల ఆదాయం లభించినట్లు తితిదే వెల్లడించింది. డిసెంబర్ నెలతో కలిపితే శ్రీవారి హుండీ ఆదాయం రూ.1,360 కోట్ల వరకూ చేరుకునే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


మరోవైపు, తిరుమల పరిసర ప్రాంతాల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే రీల్స్‌పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, అలిపిరి గేట్ వద్ద ఓ యువతి పుష్ప 2 కిస్సిక్ పాటకు డ్యాన్స్ చేయగా నెట్టింట్ వైరల్ అయ్యింది. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి రీల్స్ ఏంటంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీటీడీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


Also Read: Pushpa 2: ఏపీలో పుష్ప 2 ఫీవర్ - ఫ్లెక్సీలో మాజీ సీఎం జగన్ ఫోటో, మీకోసం మేము వస్తామంటూ పోస్టర్