Tirumala: తిరుమలకు ప్రతి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్ధం వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులకు వివిధ రూపాల్లో టీటీడీ స్వామి వారి దర్శనం కల్పిస్తుంది. అయితే సర్వదర్శనం, దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, ఆర్జిత సేవల ద్వారా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. కరోనా మహమ్మారి విజృంభించ ముందు వరకూ ఈ విధంగా సాగింది. కోవిడ్ తరువాత ఇందుకు భిన్నంగా తిరుమలలో పరిస్థితులు మారిపోయాయి. ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ దర్శనం చేసుకునేవారు. పరిమిత సంఖ్యలోనే భక్తులను వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. పరిమిత సంఖ్యలో ఆన్లైన్ లో టికెట్లు విడుదల చేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల సిపార్సు లేఖలు, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ ఆర్జిత సేవ టికెట్లు కలిగిన భక్తులను తిరుమలకు అనుమతిస్తోంది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గత నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తూ, భక్తుల సంఖ్యను క్రమేపి పెంచుతూ వస్తోంది టీటీడీ.
వర్చువల్ విధానంలో దర్శనం
కోవిడ్ మహమ్మారి విజృంభణ క్రమంలో 2020 మార్చి 20 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిని నిలిపివేసింది టీటీడీ. దాదాపు టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 80 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో భక్తులను అనుమతిని రద్దు చేశారు. కరోనా మొదటి దశ తర్వాత క్రమేపి భక్తులను భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అనంతరం రెండో దశ కోవిడ్ వ్యాప్తి సమయంలో కొండపై మరింత కఠినతరం చేస్తూ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించింది టీటీడీ. స్వామి వారి ఆర్జిత సేవలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేక పోవడంతో భక్తుల కోరిక మేరకు 2020 ఆగస్టు 7 తేదీ నుంచి శ్రీవారి ఆర్జిత సేవలను వర్చువల్ విధానంలో దర్శన భాగ్యం కల్పించింది. ఇలా ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, కళ్యాణోత్సవం వంటి ఆర్జిత సేవా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా భక్తులకు అందించింది. ఆన్లైన్ లో ఆర్జిత సేవ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఆర్జిత సేవల్లో నేరుగా పాల్గోనే అవకాశం లేకపోవడంతో భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేది టీటీడీ.
ఏప్రిల్ 1వ తేదీ ఆర్జిత సేవల్లో భక్తులకు అనుమతి
అయితే కోవిడ్ వ్యాప్తి పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టడంతో గత పాలక మండలి సమావేశంలో ఆర్జిత సేవల పునఃప్రారంభించేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలపడంతో ఏప్రిల్ 1వ తేదీ నుండి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన, తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తారు. అయితే కోవిడ్ పరిస్ధితుల విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగించనుంది టీటీడీ. అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్ విధానం కూడా యథావిధిగా కొనసాగించనుంది. అయితే వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదని స్పష్టం చేసింది. వర్చువల్ ఆర్జిత సేవల బుక్ చేసుకున్న భక్తుల దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదాలు మాత్రమే అందించనుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుంచి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతిస్తున్నారు.