TTD Cancelled Reverse Tendering Process: టీటీడీలో (TTD) రివర్స్ టెండరింగ్ విధానాన్ని (Reverse Tendering Process) రద్దు చేశారు. ఈ మేరకు ఈవో శ్యామలరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రాసెస్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీటీడీలోనూ అదే విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. కాగా, ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్టుకు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. తొలిసారి పిలిచిన టెండర్లలో ఏవైనా అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలిచే అవకాశం ఉంటుంది. అయితే, జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తోన్న ఈ విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి రాష్ట్రంలో తీసుకొచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది.
సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అటు, తిరుమలలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అత్యాధునిక వకుళామాత సెంట్రలైజ్డ్ వంటశాలను ఆయన శనివారం ప్రారంభించారు. తిరుమల ఆలయంలో పవిత్రత కాపాడేలా అంతా పని చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని చెప్పారు. భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని.. ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు. 'సింపుల్‌గా, ఆధ్యాత్మిక ఉట్టిపడే పరిసరాలు ఉండాలి తప్ప ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు. భవిష్యత్ అవసరాలకు నీటి లభ్యత ఉండేలా చూడాలి. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలి. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికు రూపొందించాలి.' అని సూచించారు.
అటు, టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్నారు. భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని అప్‌డేట్ చేస్తూ ఉండాలని సూచించారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సహా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.