Tomoto Price : మొన్నటి వరకు రూ.200 పలికిన కిలో టమాటా.. నేడు ధరలు లేక రోడ్డుపాలవుతోంది. ఆ టమాటాలు కొనే నాథుడు లేక పశువులకు ఆహారంగా మారుతున్నాయి. 3 నెలల వరకు కిలో రూ. 300 వరకు పలికిన టమాటా.. ఇప్పుడు 30 పైసలకు కూడా కొనే దిక్కులేక నేలపాలవుతోంది. పంట పండించిన రైతులు రవాణా ఛార్జీలు కూడా రావనే ఉద్దేశంతో టమాటాలను రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్, కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్లు టామోటాలకు ప్రసిద్ధి. ఇక్కడ టమోటాలు కొని దేశం మొత్తం ఎగుమతి చేస్తూంటారు. ఇప్పుడు ఈ మార్కెట్లలో టమోటా ధర పూర్తిగా పతనం అయింది.
మదనపల్లి, ప్యాపిలి మార్కెట్లలో అతి తక్కువ ధఱలు
25 కేజీల బాక్స్ 10 రూపాయల నుంచి 35 రూపాయలు పలుకుతోంది. అంటే కేజీ టమాటా ధర దాదాపు 30 నుంచి 40 పైసలు పలుకుతోంది. దీంతో గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై రైతులు టమాటాలను పారబోస్తున్నారు. గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేల మీద పారబోసే స్థాయికి చేరుకున్నాయి.
నెల రోజుల్లోనే తలకిందులైన టమాటా రైతుల పరిస్థితి
పెరిగిన టమాటా ధరలు జూన్, జూలై నెలలో రైతులకు కాసుల వర్షం కురిపించాయి. ఊహకందని ధరలతో కొందరు రైతులను టమాటా కోటీశ్వరులను చేసింది. ఇదే విషయాన్ని రైతులు స్వయంగా చెప్పారు. టమోటాకు ఇంత ధర ఎప్పుడూ లేదని, చాలా డబ్బు సంపాదించామని తెలిపారు. అయితే ఇప్పుడు అదే టమోటా రైతుకు కంటతడి పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేక పూర్తిగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పలు ప్రాంతాల నుంచి టన్నుల కొద్దీ పంట వస్తుండటం, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు రాకపోవడంతో.. టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓ నెల క్రితం మార్కెట్‌కు టమాటాలు తీసుకొచ్చి జేబు నిండా డబ్బులు తీసుకెళ్లిన రైతు.. ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
ధరల స్థిరీకరణ ముఖ్యమంటున్న రైతులు
పంటకు పెట్టుబడి, ఎరువులు, కూలీల ఖర్చులు కూడా పూడే పరిస్థితి లేదని కంటతడి పెట్టుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తీరా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురుస్తూ నష్టాలను కలిగిస్తున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. టమోటాల ధరల్లో హెచ్చుతగ్గులు ప్రతీ ఏడాది ఇలాగే ఉంటున్నాయి. ఎక్కువగా రైతులు నష్టపోతున్నారు. ఎప్పుడో ఓ సారి జాక్ పాట్ కొడుతున్నారు. ఇలా ఉండటం కన్నా.. ధరల స్థిరీకరణకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది.