1 KG Tomato Price in AP : టమాటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో కేజీ ధర రూ.100 మేర పెరిగింది. జూన్ మూడో వారం వరకు రూ.30 ఉన్న కేజీ టమాటా ధర, చివరి వారంలో ఏకంగా రూ.120- 130 కి చేరింది. అయితే పెరిగిన టమాటా ధరలతో రాష్ట్ర ప్రజల ఇబ్బందిని గమనించిన ఏపీ ప్రభుత్వం వారికి ఊరట కల్పిస్తోంది. కూరగాయల మార్కెట్లలో రాయితీపై టమాటాలను విక్రయిస్తోంది. కేజీ టమాటాను రూ.50కు విక్రయాలు మొదలుపెట్టడంతో ప్రజలు మార్కెట్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాంతో ఏపీలో రాయలసీమలో పలు జిల్లాల్లో కూరగాయల మార్కెట్ల వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాల్లోనూ తక్కువ ధరకు టమాటా విక్రయించి ప్రజల ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు.


వర్షాభావంతో పాటు ఎండ వేడికి టమాటా దిగుబడి ఒక్కసారిగా తగ్గింది. మార్కెట్లో సగానికి సగం పంట రాకపోవడంతో డిమాండ్ మరింత పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. మదనపల్లి మార్కెట్లో కేజీ టమాటా ధర సైతం రూ.124కి చేరడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకే టమాటా అందిస్తామని చెప్పింది. జగన్ ప్రభుత్వం ఏపీ మార్క్​ఫెడ్ ద్వారా రాయితీపై టమాటాలు విక్రయిస్తుంది. 


ఆధార్ కార్డు తీసుకువస్తే ఒక్క కేజీ టమాటా రూ.50కి విక్రయిస్తున్నారు. దాంతో ఉదయం 6 గంటల నుంచే ప్రజలు మార్కెట్లకు క్యూ కడుతున్నారు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నవారికి సరిపోతాయి కానీ, ఒకే ఇంట్లో అయిదుగురు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి కిలో టమాటా ఒకే రోజుకు సరిపోతుందని ప్రజలు చెబుతున్నారు. బయట రూ.120కి కొనే బదులు మార్క్ ఫెడ్ ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న టమాటాలు సగం కంటే తక్కువ ధరలకు లభిస్తుంటడంతో రైతు బజార్ లు వేకువజాము నుంచే ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.


మండుతున్న టమాటా ధరలు, రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం భారీ ఊరట 
మార్కెట్లో టమాటా ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కార్ ఉపశమనం కల్పించింది.  రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో  కిలో రూ.50 టమాటాను విక్రయించడానికి నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్ లో టమోటా ధర మోత మోగిపోతోంది. దీంతో సామాన్యడు టమాటా వైపు చూడాలంటేనే భయపడే పరిస్దితి నెలకొంది. టమాటా ధరలను నియంత్రించే క్రమంలో భాగంగా రైతుబజార్లలో విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీ 50రూపాయల చప్పున టమాటా విక్రయాలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లను కూడ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రజలకు నిత్యావసర కూరగాయల అంశంలో ఊరట లభించింది. కడప, కర్నూలులోని రైతు బజార్లలో  ఇప్పటికే మార్కెటింగ్ శాఖ టమాట విక్రయాలను ప్రారంభించింది. ''సబ్సిడీ ధర పై టమాటా విక్రయాలు శుక్రవారం నుంచి మరిన్ని జిల్లాల్లో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోనూ క్రమంగా టమాటా విక్రయాలు ప్రారంభం కానున్నాయి” అని రైతు బజార్ల సీఈఓ నంద కిషోర్ తెలిపారు.  
Join Us on Telegram: https://t.me/abpdesamofficial