టీటీడీ నిబంధనలను అధికార పార్టీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. తిరుమలలో రాజకీయ పార్టీ జెండాలు, కండువాలు, ప్రచారాలు చేయకూడని‌ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తిరుమలకు పార్టీ‌ కండువాలతో వచ్చేస్తున్నారు‌ కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తన కారులో వైసీపీ పార్టీ కండువాను తీసుకుని వచ్చారు. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో కారును ఆపిన ఎమ్మెల్సీ కారులో అధికార పార్టీ కండువాను చూసి కొందరు భక్తులు‌ మండిపడుతున్నారు. 


తిరుమలకు‌ వచ్చే ప్రతి భక్తుడిని, వాహనాన్ని ముందుగా అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేసినంతరం కొండకు అనుమతిస్తుంటారు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రాజకీయ పార్టీకి చెందిన కండువాలు, గుర్తులు, జెండాలతో నేరుగా కొందరు ఏడుకొండలకు వెళ్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడ్డుతున్నా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ‌మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు.