సాధారణంగా అధిక రద్దీ ప్రాంతంలో దొంగలున్నారు జాగ్రత్త అంటూ బోర్డులు కనిపిస్తాయి. మనకు తెలియకుండా దొంగతనం చేసే వాళ్ళు ఉంటే అలా బోర్డులు పెడుతుంటారు. ఇక ఎవరూ లేని సమయంలో ఇంటిని దోచుకెళ్ళే దొంగలని కూడా మనం చూశాం. మూసి ఉన్న దుకాణాల్లో సరకును మొత్తం దోచుకెళ్లిన ఘటనలు కూడా గతంలో చాలా ఉన్నాయి. ఎక్కువగా జువెలరీ షాపుల్లో ఇలాంటి దొంగతనాలు జరుగుతాయి. 


కానీ తాజాగా తెరచి ఉన్న దుకాణంలో దొంగలు లూటీ చేయడం చాలా అరుదు. పట్టపగలు దుకాణంలో అందరూ ఉండగానే ఓ దొంగ చేతి వాటం చూపించాడు. ఇదిగో పులి.. అదిగో పిల్లి అంటూ మాయమాటలు చెప్పి.. సునాయసంగా నగలను దొంగలించుకుని వెళ్ళి పోయాడు. చిత్తూరు జిల్లా, పుత్తూరు పట్టణంలోని మండీ వీధిలో బంగారు దుకాణంలో ఈ ఘటన జరిగింది. అక్కడ ఉన్న చిన్న దుకాణం లలిత జువెలర్స్ యజమాని మురళి శనివారం తెరిచి యధావిధిగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. 


దుకాణంలో యజమాని మురళి మినహా ఎవరు లేని సమయం చూసి ఓ వ్యక్తికి దుకాణంలోకి ప్రవేశించాడు. దీంతో మురళి అతనికి నగలు చూపించసాగాడు. 20 గ్రాముల గొలుసు తీసుకున్న దొంగ బిల్లు వేసే సమయంలో దాన్ని జేబులో వేసుకున్నాడు. బిల్లు వేయండి.. బంధువులు నగదు తెస్తున్నారని నమ్మబలికాడు. ఫోన్ వచ్చినట్లు మాట్లాడుతూ అటు ఇటు దుకాణంలో కొంత సమయంలో తిరిగాడు. బయట ఓ యాచకురాలు రావడంతో ఆమెకు చిల్లర వేసి వస్తానని చెప్పి వెళ్లాడు. ఆమెకు చిల్లర వేసి అటు ఇటు చూసి దుకాణం నుంచి కొంత దూరం నడిచి వచ్చి అక్కడి నుంచి పరుగున వెళ్లిపోయాడు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దుకాణ యజమాని ఈ చోరీపై పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.