Vaikunta Ekadasi 2023: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం అయింది. ఆదివారం (జనవరి 1) తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ టోకెన్లను వివిధ కౌంటర్ల ద్వారా ఇస్తున్నారు. తొలుత ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలుపెడతామని, టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ, రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇవ్వడం మొదలుపెట్టారు. దీనివల్ల రద్దీ తగ్గినట్లయింది. జనవరి 2 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి జనవరి 11 వరకు భక్తులు దర్శించుకునేందుకు తిరుపతి నగరంలోని 9 కౌంటర్ల ద్వారా స్లాటెడ్‌ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లను ఇస్తున్నారు. 


TTD Vaikunta Dwara Darshanam: ఈ టికెట్లు రోజుకు 45 వేల చొప్పున భక్తులకు ఇవ్వనున్నారు. అలా పది రోజులకు గానూ మొత్తం 4.5 లక్షల స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఇవ్వడానికి టీటీడీ ఏర్పాటు చేసింది. పది రోజులకు గానూ 4.5 లక్షల టోకెన్లు పూర్తయ్యాక ఆ టోకెన్లు జారీని నిలిపివేస్తారు. వీటి వివరాలు ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్‌సైట్‌, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ద్వారా తెలుసుకొనేలా ఏర్పాట్లు చేశారు. టోకెన్‌ జారీ కేంద్రాల వద్ద భక్తులు విపరీతంగా బారులు తీరి ఉండడంతో వారి కోసం అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, టీ, కాఫీ లాంటి వాటిని టీటీడీ ఏర్పాటు చేసింది.


వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లు ఇచ్చే కౌంటర్లు ఇవే


తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానికేతరుల కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్‌, శ్రీనివాసం, ఇందిరా మైదానం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల, ఎమ్మార్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో శేషాద్రి నగర్‌లోని జడ్పీహెచ్ఎస్ హై స్కూలు, గోవిందరాజ స్వామి సత్రాలు తదితర చోట్ల వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు.                                              


హుండీ ఆదాయం ఎంతంటే


నూతన సంవత్సరం సందర్భంగా శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు.. నూతన సంవత్సరం పురస్కరించుకుని కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో‌ తిరుమలకు చేరుకుంటున్నారు.. మరోవైపు రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనంకు పరితపించి పోతున్నారు.. అయితే శనివారం నాడు స్వామి వారిని 78,460 మంది దర్శించుకోగా, 29,182 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.. ఇక స్వామి వారికి భక్తులు కానుకల హుండీ రూపంలో 4.03 కోట్ల రూపాయలు లభించింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 15 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి‌ ఉన్నారు.. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 18 గంటల సమయం పడుతుంది.. ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది..